Pulihora and Ravvakesari Prasadam Recipes : చండీదేవికి చింతపండు పులిహోర, రవ్వకేసరి.. దసరా నవరాత్రుల్లో అయిదో రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే
Dussehra 2024 Day 5 Special Pulihora Prasadam Recipe : దశమి నవరాత్రుల్లో అమ్మవారు అయిదో రోజు చండీదేవి రూపంలో కనిపిస్తారు. ఆరోజు అమ్మవారికి పెట్టుకోగలిగే రెసిపీలు ఏంటో.. ఎలా చేయాలో చూసేద్దాం.
Vijayadashami Special Recipes : దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి భక్తులు వివిధ రకాల నైవేద్యాలు పెడతారు. అమ్మవారు కూడా పలు అవతారల్లో భక్తులకు దర్శనమిస్తారు. అయిదోవ రోజు అమ్మవారు చండీదేవి రూపంలో కనిపిస్తారు. ఈ అమ్మవారికి చింతపండు పులిహోర, రవ్వకేసరి నైవేద్యంగా పెడతారు. వీటిని చెప్పిన టిప్స్ ఫాలో అయితూ చేస్తే కచ్చితంగా టెంపుల్ స్టైల్ రుచి వస్తుంది. మరి వీటిని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు పులిహోర కావాల్సిన పదార్థాలు
చింతపండు - 50 గ్రాములు
బియ్యం - కప్పు
నీళ్లు - రెండు కప్పులు
పసుపు - టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కరివేపాకు - 1 రెబ్బ
పచ్చిమిర్చి - 5
నువ్వుల నూనె - టేబుల్ స్పూన్
ఆవాలు - రెండు టేబుల్ స్పూన్లు
అల్లం - రెండు అంగుళాలు
ఉప్పు - కొద్దిగా
ఎండుమిర్చి - రెండు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మెంతులు - టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
బెల్లం - 1 టేబుల్ స్పూన్
ఇంగువ - పావు చెంచా
తాళింపు కోసం
నూనె - పావు కప్పు
ఆవాలు - టీస్పూన్
పల్లీలు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 5
కరివేపాకు - 1 రెబ్బ
తయారీవిధానం
ముందుగా చింతపండును గోరువెచ్చని నీటిలో వేసి నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలో కడిగిన బియ్యం వేసుకోవాలి. కొలతకు, ఉడకడానికి సరిపడా నీళ్లు వేయాలి. రెండు విజిల్స్ రానివ్వాలి. అన్నం సిద్ధమైపోతుంది. ఇప్పుడు దానిలో పసుపు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వుల నూనెవేసి బాగా కలపాలి. అన్నం కాస్త వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ కలపకూడదు.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో ఆవాలు వేసుకోవాలి. అల్లం, ఉప్పు, ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టి.. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టాలి. దానిలో నూనె వేసి ఆవాలు వేయాలి. మెంతులు కూడా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. అనంతరం కరివేపాకు వేయాలి. ఇప్పుడు దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. అనంతరం కాస్త బెల్లం వేసి బాగా కలపాలి. చివర్లో ఇంగువ వేసి ఉడికించి.. ముందుగా పేస్ట్ చేసిపెట్టుకున్న ఆవాల మిశ్రమం వేసి ఉడికించాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిని చల్లారిపోయిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.
తాళింపు కోసం కడాయి పెట్టి దానిలో నూనె వేయాలి. ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చివర్లో కరివేపాకు వేసి తాళింపు వేసుకోవాలి. దీనిని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుంటే చింతపండు పులిహోర రెడీ. ఉప్పు అడ్జెస్ట్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రుచి వస్తుంది. అయితే ఐదోరోజు అమ్మవారికి కేవలం చింతపండు పులిహోరనే కాకుండా.. రవ్వకేసరి కూడా చేస్తారు. అదేలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
నెయ్యి - అరకప్పు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్లు
రవ్వ - 1 కప్పు
నీళ్లు - మూడు కప్పులు (వేడి చేసినవి)
పంచదార - ఒకటిన్నర కప్పు
నెయ్యి - పావు కప్పు
ఫుడ్ కలర్ - చిటికెడు
యాలకుల పొడి - 1 టీస్పూన్
నెయ్యి - పావు కప్పు
పచ్చకర్పూరం - పావు టీస్పూన్
తయారీ విధానం
ముందు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేసి.. జీడిపప్పు, ఎండుద్రాక్షలు వేయాలి. వెంటనే దానిలో రవ్వ వేసి.. మూడింటిని కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. రవ్వ నుంచి మంచి అరోమా వస్తుంది. ఇలా మంచి కలర్, వాసన వచ్చిన తర్వాత దానిలో వేడి నీళ్లు వేసి ఇలా కలపాలి. నీళ్లల్లో రవ్వ మంచిగా ఉడుకుతున్న సమయంలో పంచదార వేయాలి.
పంచదార రవ్వలో బాగా కరిగి కలిసిపోతుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసి కలిపాలి. నెయ్యిని పైకి వచ్చేవరకు రవ్వను తిప్పుతూ ఉండాలి. అనంతరం ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవాలి. దీనిలో యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకుని దించేయాలి. ప్రసాదం కాకుండా నార్మల్గా చేసుకోవాలనుకున్నప్పుడు పచ్చకర్పూరం వేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి రెడీ.
Also Read : అన్నపూర్ణ దేవికి అల్లం గారెలు.. నవరాత్రుల్లో మూడోవ రోజు చేయాల్సిన నైవేద్యం ఇదే