Mosambi: బత్తాయి పండుని చులకనగా చూడకండి, దాన్ని తినడం చాలా అవసరం
మోసంబి లేదా బత్తాయి... ఈ పండును చాలా మంది తినడానికి ఇష్టపడరు.
నారింజలు, యాపిల్స్, దానిమ్మలు, కివి వంటి పండ్లను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ బత్తాయిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. అది కాస్త పుల్లగా ఉండే పండు. తీయగా ఉండదు. కాబట్టే మోసంబిని అధిక శాతం మంది తినరు. అయితే ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన పండ్లలో మోసంబి మొదటి స్థానంలోనే ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల 45 కేలరీలు అందుతాయి. అలాగే విటమిన్ సి, ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. పొట్టలో మంట, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు బత్తాయి పండును తినేందుకు ప్రయత్నించండి.
డీహైడ్రేషన్ సమస్య ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది. అలాంటివారు బత్తాయి పండు రసాన్ని ఇంట్లోనే చేసుకుని తాగండి. అయితే అందులో చక్కెర వేయొద్దు. దీనిలో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి.ఈ పండు తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య చాలా త్వరగా తగ్గిపోతుంది. అలాగే మోసంబి రోజూ తాగితే మీ చర్మం చాలా మృదువుగా మారిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలపై కూడా మోసంబి చాలా ప్రభావం చూపిస్తుంది. జుట్టు మంచిగా ఎదిగి పట్టుకురుల్లా ఉంటాయి. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా బత్తాయి కాపాడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు బత్తాయిని తినేందుకు ప్రయత్నించాలి.
ఎంతోమంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు బత్తాయి పండును తమ డైట్లో చేర్చుకోవాలి. ఇది బరువును త్వరగా తగ్గిస్తుంది. కొందరికి వాంతులు, వికారం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటివారు ఈ పండును తింటే ఆ లక్షణాలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే మోసంబి ఎంతో సహకరిస్తుంది. ఈ పండును రోజూ ఒకటి తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్య పూర్తిగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా బత్తాయిని తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చిగుళ్ళు, నాలుక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఎంతో మంది స్త్రీలకు కాలి పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడేసే సత్తా మోసంబికి ఉంది. కాబట్టి బత్తాయి పండును కచ్చితంగా చేర్చుకోండి.
Also read: మద్యం తాగితే మగాళ్ళ కన్నా మహిళలకే ఎక్కువ ప్రమాదమా?
Also read: ఆ సమయంలో దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.