Milk: రోజూ పాలు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
చెడు కొలెస్ట్రాల్ చాలా సమస్యలకు కారణం అవుతుంది. పాలు వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుందా?
అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అధిక రక్తపోటు, గుండె పోటు, స్ట్రోక్ వంటివి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరకుండా, అందులో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అయితే చాలా మంది పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ చేరుతుందని, అందులో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందని అనుకుంటారు. పాలు పూర్తిగా తాగడమే మానేస్తారు. కానీ అది పూర్తిగా అపోహ అని కొట్టి పడేస్తున్నారు పోషకాహారనిపుణులు.
కొలెస్ట్రాల్ అంటే...
కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వు మాత్రమే అనుకుంటారు అంతా. కానీ ఇది కొవ్వు, ప్రోటీన్లతో కూడిన లిపిడ్. ఇది రక్తంలో ఉండే మైనంలాంటి పదార్థం.శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి ఇది చాలా అవసరం. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయి ప్రమాదకరమైన స్థాయికి చేరితే కానీ అది అనారోగ్యాలను కలిగించదు. చెడుకొలెస్ట్రాల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ (LDL) అంటారు. ఇక హై డెన్సిటీ లిపోప్రోటీన్ (HDL) గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే చెడు కొలెస్ట్రాల్ (LDL) రక్తనాళాలలో పేరుకుంటుంది. ఇది అధికంగా పేరుకుంటే రక్తప్రసరణకు భంగం కలిగి గుండె సమస్యలకు దారి తీస్తాయి.
పాలు వల్ల ప్రభావం ఎంత?
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలపై అధికం ప్రభావం పడదు. పాలు, పాల ఉత్పత్తులు చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయన్న ఆధారం ఎక్కడా లేదు. అంతేకాదు పాలు చెడుకొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిర్ధారించారు. రోజూ పాలు తాగేవాళ్లలో గుండె సంబంధ వ్యాధుల్లో ఒకటైన కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 14 శాతం తగ్గుతుందని కూడా గతంలో చాలా పరిశోధనలు చెప్పాయి. పాలు మితంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు. కాబట్టి రోజుకో గ్లాసు పాలు తాగితే మంచిదే.
పాల వల్ల లాభాలు
రోజులో పావు లీటరు పాలు తాగితే అందులో 8 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఒక్క ఆ కొవ్వు గురించి ఆలోచించి పాలు తాగడం మానేయద్దు. శరీరానికి రోజువారీ అవసరాలకి కావాల్సిన ఇతర పోషకాలు కూడా పాలలో పుష్కలంగా ఉన్నాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. దీనివల్ల వయసు ముదిరాక బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం, జింక్, అయోడిన్ వంటివి లభిస్తాయి.
Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Also read: షాకింగ్ ఆవిష్కరణ, మనుషుల హార్ట్ బీట్‌ను వినగలిగే ఫ్యాబ్రిక్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు