Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Karivepaku Annam : వేడి వేడి అన్నంతో అయినా.. మిగిలిపోయినా అన్నంతో అయినా టేస్టీగా ఏమైనా తినాలనుకుంటే మీరు హ్యాపీగా కరివేపాకు అన్నం చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

- కరివేపాకు రుచి, సువాసనతో ఆరోగ్యాన్నిచ్చే ప్రధాన పదార్థం.
- మిగిలిన అన్నంతో కరివేపాకు రైస్ సులభంగా చేసుకోవచ్చు.
- కరివేపాకు, మసాలాలు వేయించి, పొడి చేసి అన్నంతో కలపాలి.
- పోపు వేసి, సిద్ధం చేసిన పొడిని కలిపితే రుచికరమైన రైస్.
Karivepaku Rice Recipe : కరివేపాకు వంటలకు మంచి రుచిని, సువాసనను అందిస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి కరివేపాకును రోజూ చేసే వంటల్లో పక్కన పెట్టేస్తున్నారా? అయితే ఈసారి దానితో రుచికరమైన కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకోండి. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని త్వరగా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
అన్నం - 2 కప్పులు
కరివేపాకు - 2 కప్పులు
ఎండుమిర్చి - 3
పచ్చిమిర్చి - 2
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
వేరుశెనగలు - 2 టేబుల్ స్పూన్లు
Also Read : నోరూరించే కరివేపాకు పచ్చడి.. అదిరే రుచి రావాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి
చింతపండు - చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి - 3 రెబ్బలు
ఆవాలు - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
ఇంగువ - చిటికెడు
కరివేపాకు రైస్ తయారీ విధానం
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి కరివేపాకును తక్కువ మంటపై వేయించాలి. ఆకులు క్రిస్పీగా మారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. వీటిని చల్లారనిచ్చి వేయించిన కరివేపాకుతో కలపాలి. కావాలనుకుంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు.
Also Read : టేస్టీ, హెల్తీ కరివేపాకు పొడి రెసిపీ.. ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది
ముందుగా వేయించిన దినుసులన్నింటినీ మిక్సీలో వేసి, తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా లేదా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండును ఎక్కువగా వేయకుండా రుచికి తగినట్లు కలపాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక శనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పసుపు, ఇంగువ వేసి కలపాలి.
ఇప్పుడు ఉడికించి చల్లార్చిన అన్నాన్ని పాన్‌లో వేయాలి. తయారు చేసుకున్న కరివేపాకు పొడిని వేసి అన్నం విరిగిపోకుండా మెల్లగా కలపాలి. తక్కువ మంటపై రెండు మూడు నిమిషాలు ఉంచితే కరివేపాకు మసాలా అన్నానికి బాగా పడుతుంది. చివరగా ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. రుచికరమైన కరివేపాకు రైస్ సిద్ధం. దీనిని పెరుగు, రైతా లేదా పాపడ్స్‌తో కలిపి తింటే బాగుంటుంది.
Also Read : ఉదయాన్నే కరివేపాకు తింటే కలిగే లాభాలు ఇవే.. మధుమేహం దూరం చేయడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























