Mystery Disease in China: మళ్లీ వణికిస్తున్న చైనా - ఆ మిస్టరీ వైరస్ మీ వరకు రాకూడదంటే ఇలా చేయండి
Pneumonia in China: చైనాలో మరో మహమ్మారి పురుడు పోసుకుంది. వేలాది మంది చిన్నారులు న్యూమోనియా బారిన పడుతున్నారు. దీంతో పొరుగు దేశమైన మనకు కూడా ఆ పరిస్థితి రావచ్చు.
China pneumonia: మరో మహమ్మారికి చైనా జన్మ నివ్వబోతోందా.. తాజాగా ఉత్తర చైనాలో నమోదైనటువంటి న్యూమోనియా కేసులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇటీవల ఉత్తర చైనాలోని కొన్ని నగరాల్లో ముఖ్యంగా పిల్లల్లో H9N2 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే కరోనా దెబ్బ నుంచి పూర్తిగా ప్రపంచం కోలుకోలేదు. అలాంటి సమయంలో మరో మహమ్మారి కూడా ముంచుకొస్తుందా.. అనే భయం సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో మన దేశంలో సైతం వైద్యులు ఇప్పటినుంచే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.
ఆ పరిస్థితి మనకు రాకూడదంటే?
☀ ఎవరైనా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
☀ ఇతరులతో కలవకుండా కొద్దిగా దూరం పాటించాలి
☀ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
☀ కోవిడ్ సమయంలో పాటించినటువంటి పరిశుభ్రత చర్యలను పాటిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
☀ ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు ఎన్ 95 మాస్కులను ఉపయోగించాలి.
☀ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.
☀ పిల్లల్లో దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య పెరగడం వల్ల చైనాలో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) సైతం ఈ కేసుల పట్ల చాలా ఆందోళన చెందుతోంది. వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించేందుకు చైనాలోని అధికారులతో సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వెళ్లే చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉత్తర చైనాలోని కొన్ని ఆరోగ్య కేంద్రాలలో దాదాపు 1200 మంది పిల్లలు చేరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే COVID కఠినమైన లాక్‌డౌన్ కారణంగా పిల్లలలో రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితమైందని, ఫలితంగా కేసులు పుంజుకుంటున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల ఏమీ లేదని ఢిల్లీకి చెందిన పలువురు వైద్యులు తెలిపారు. సాధారణంగా ప్రతి సంవత్సరం శీతాకాలానికి ముందు ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతాయని, అయితే ఈ కేసుల్లో అసాధారణ పెరుగుదల కూడా ఏమి లేదని వైద్యులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ వ్యాధి లక్షణాలు ఇంకా కనిపించలేదని అందుకే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే, చలికాలం.. వైరస్‌లు, బ్యాక్టీరియాలకు ఫేవరెట్ కాలం. కాబట్టి.. మన జాగ్రత్తల్లో మనం ఉండటం బెటర్. చైనా ప్రజలకు ఏర్పడిన పరిస్థితి మనకు రాకూడదంటే డాక్టర్ల సూచనలు పాటించాల్సిందే.
Also Read : ఏడ్వండి, ఏడ్వండి బాగా ఏడ్వండి - ఏడుపు ఆరోగ్యానికి మంచిదే, ఎలాగంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply