Chikki: చిక్కుడు గింజలతో చిక్కీ చేసి చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యం - పైగా ఎంతో రుచి
చిక్కుడు గింజలతో చేసే చిక్కీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
చిక్కీ అనగానే అందరికీ నువ్వులతో, పల్లీలతో చేసిన చిక్కీలే తెలుసు. కానీ కొన్నిచోట్ల చిక్కుడు గింజలతో కూడా చిక్కీలు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు, పెద్దలూ ఇద్దరూ వీటిని కచ్చితంగా తినాలి. బయట మార్కెట్లో ఇవి దొరకవు. ఇంట్లోనే తయారు చేసుకోవాలి. వీటిని తయారు చేయడం చాలా సులువు.
గ్రామాల్లో దేశీ చిక్కుడు పాదులు చాలా ఉంటాయి. వాటిల్లోని చిక్కుడు గింజలు పెద్దవిగా ఉంటాయి. చూడడానికి సోయా బీన్స్ లా పెద్దవిగా ఉంటాయి. చిక్కుళ్ల నుంచి వీటిని విడదీసి నీటిలో నానబెట్టాలి. బాగా నానాక వాటిని ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. తరువాత పైనున్న పొట్టు తీసేయాలి. ఇప్పుడు బెల్లాన్ని ముదురు పాకం తీయాలి. మరోపక్క ఈ ఎండిన చిక్కుళ్లను ఓసారి కళాయిలో వేసి వేయించాలి. నూనె వేయాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ముదురు బెల్లం పాకంలో వేయించిన చిక్కుడు గింజలను వేసి బాగా కలపాలి. కాస్త యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఒక పళ్లానికి అడుగున నెయ్యి లేదా నూనె రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. కాస్త పొడిగా అయ్యాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా ఎండిపోతే చాలా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మీరు ముక్కలు కోయలేరు. కాబట్టి కాస్త మెత్తగా ఉన్నప్పుడే ముక్కలు కోసి పెట్టుకోవాలి.
చిక్కుడు గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఉండే బెల్లం కూడా మనకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ చిక్కుడు గింజలతో చేసిన చిక్కీలను తినడం చాలా ముఖ్యం. బాలింతలకు కూడా ఈ చిక్కీలు ఎంతో మేలు చేస్తాయి. వారిలో రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. ఎముకలు గట్టిగా మార్చడంలో, నడుము నొప్పిని తగ్గించడంలో ఈ ఆహారం ముందుంటుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లను అడ్డుకోవడంలో కూడా ఇది ముందుంటుంది. వీటిని ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. ఇందులో ఉండే బెల్లం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీన్ని తినడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. క్యాన్సర్, డిమెన్షియ వంటి వాటిని రాకుండా అడ్డుకుంటుంది. బెల్లం తినడం వల్ల ఏజింగ్ లక్షణాలు కూడా తగ్గుతాయి. పిల్లలకు కూడా ఈ చిక్కుడు గింజలు చాలా మేలు చేస్తాయి. వీటిని ఇంట్లోనే తయారుచేసుకుని తినాలి.
Also read: చర్మం మృదువుగా మారాలా? ప్రతిరోజూ గుడ్డు తినండి
Also read: గాలి కాలుష్యంతో జాగ్రత్త, త్వరగా పక్షవాతం బారిన పడతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.