Vitamin D: విటమిన్-D సప్లిమెంట్లు శరీరాన్ని యవ్వనంగా ఉంచుతాయా? తాజా పరిశోధనలో ఏం తేలిందంటే?
ఆరోగ్యానికి అవసరమయ్యే సూక్ష్మపోషకాల్లో విటమిన్ డి చాలా అవసరమైంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉండాలంటే విటమిన్ D కావాలి. విటమిన్ D తగ్గితే రోగనిరోధక వ్యవస్థ, మెదడు ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల విటమిన్లు, పోషకాలు శరీరానికి అందాల్సిందే. లేకపోతే అనేక సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. అయితే, విటమిన్-D కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదట. యవ్వనాన్ని కూడా అందిస్తుందట. అదెలా అనుకుంటున్నారా? అయితే, తాజా పరిశోధనల్లో పేర్కొన్న ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోవల్సిందే.
వయసు పెరిగేకొద్ది మన కండరాలు ఎముకలు బలహీన పడతాయి. విటమిన్ D కండరాలు ఎముకల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత విటమిన్ D లేకపోతే కండరాల పటుత్వం తగ్గిపోతుంది. కనుక వయసు పెరిగే కొద్దీ విటమిన్ D సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటంది.
ఇటాలియన్ పరిశోధకులు విటమిన్ D గురించి జరిపిన కొత్త అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతున్న వారికి విటమిన్ D సప్లిమెంట్లను సూచిస్తున్నారు. అకారణంగా ఎముకలు విరిగే పరిస్థితిని నివారించడానికి ఆస్టియోపొరోసిస్ పేషెంట్లకు విటమిన్ D అవసరం.
కొన్ని ఆహార పదార్థాల నుంచి విటమిన్ D లభిస్తున్నప్పటికి శరీర అవసరాలకు తగిన మొత్తంలో లభించడం కష్టం. సూర్యరశ్మిలో ఎక్కువ సమయం గడపలేకపోవడం దీనికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఆస్టియోపొరోసిస్ వంటి జబ్బులేవీ లేని ఆరోగ్యవంతులలో వయసుతో వచ్చే ఎముకల నష్టాన్ని విటమిన్ D సప్లిమెంట్లు పెద్దగా నివారించలేవని కొత్త అధ్యయనం సూచిస్తోంది.
వయసు ప్రభావాన్ని తగ్గిస్తుందా?
వయసు పెరుగుతున్నపుడు శరీరంలో వచ్చే మార్పుల మీద విటమిన్ D ప్రభావాన్ని గురించిన అధ్యయనం కోసం నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ విషయాలను దృవీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో వయసు ప్రభావం వల్ల శరీరంలో వచ్చే మార్పుల మీద విటమిన్ D సప్లిమెంట్ల ప్రభావం నామమాత్రమే అని చెబుతున్నారు.
అయితే మరికొన్ని అధ్యయనాల్లో విటమిన్ D ఎపిజెనెటిక్ వృద్ధాప్య వేగాన్ని నియంత్రిస్తున్నట్టు సూచిస్తున్నాయి. విటమిన్ D తక్కువ ఉన్న వ్యక్తుల బాడీ ఎజ్ విటమిన్ D తగినంత ఉన్న వారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారట.
డీఎన్ఏ నష్టాన్ని విటమిన్ D సప్లిమెంట్లు తగ్గించవచ్చని మరో అధ్యయనం వివరిస్తోంది. డిఎన్ఏ లోని టెలోమెరస్ చర్య మీద విటమిన్ D సప్లిమెంట్లు ప్రభావం చూపుతున్నాయట. ముఖ్యంగా స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో టెలోమీరస్ పొడవు పెరగడాన్ని నిరోధిస్తున్నట్టు తెలుస్తోంది.
అతిగా తీసుకుంటే ప్రమాదమే
కొన్ని అధ్యయనాలు తగిన మోతాదులో విటమిన్ D తీసుకోవడం సురక్షితమే అని సూచిస్తున్నాయి. అయితే ఇది అందరిలో విటమిన్ D అవసరాలు ఒకే విధంగా ఉండవు. విటమిన్ D అవసరానికి మించి తీసుకుంటే హానికరమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సప్లిమెంట్ల రూపంలో విటమిన్లను ఎక్కువ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత సమయం ఆరుబయట సూర్యరశ్మిలో గడపడానికే ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి సూచన.
దీర్ఘాయుష్షుకు విటమిన్ D సప్లిమెంటేషన్ వల్ల కొంత అవకాశం ఉన్నప్పటికీ వయసు ప్రభావిత లక్షణాలను నివారించడంలో విటమిన్ D సామర్థ్యం గురించి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నా ప్రస్తుతం ఆ విషయాన్ని దృవీకరించడం సాధ్యపడదని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది.
Also Read : Brain Size: మనిషి మెదడు పరిమాణం పెరుగుతోందట, ఆ రోగులకు ఇది శుభవార్త? స్టడీలో ఏం తేలింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.