Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే
వాతావారం చల్లగా ఉండే శీతాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయనే దానిలో ఎంత వరకు వాస్తవం ఉంది ఆరోగ్య నిపుణులు ఏం సూచిస్తున్నారు.
చలికాలంలో శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెరుగు ఒకటి. కానీ చాలా మంది చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తుందని చెప్తూ ఉంటారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని వాస్తవానికి పెరుగు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. భారతీయులు పెరుగుతో తినకుండా భోజనం ముగించరు. ఇది పోషకాహారమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
చలికాలంలో వ్యాధులు, వైరస్ లు యాక్టివ్ గా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి చురుగ్గా ఉండాలి. పెరుగు వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, శరీరాన్ని దృఢంగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది. లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తాయి.
శీతాకాలంలో పెరుగు తినడం గురించి ఉన్న అపోహలు
అపోహ: దగ్గు, జలుబు వస్తాయి
వాస్తవం: పెరుగుని సైడ్ డిష్ గా తినడమే కాకుండా చలికాలంలో డెజర్ట్ గా కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ప్రోబయోటిక్స్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గుని దూరంగా ఉంచుతాయి.
అపోహ: రాత్రిపూట పెరుగు తినకూడదు
వాస్తవం: రోజు రాత్రి పెరుగు తినడం చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. మెదడులో ట్రిప్టోఫాన్ అనే ప్రత్యేకమైన అమైనో ఆమ్లాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల నరాలకు మరింత విశ్రాంతినిస్తుంది. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల ట్రిప్టోఫాన్ కారణంగా న్యూరాన్లు తేలికపాటి విశ్రాంతితో రీఛార్జ్ అవుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి.
అపోహ: పాలిచ్చే తల్లులు పెరుగుకి దూరంగా ఉండాలి లేదంటే శిశువు అనారోగ్యం బారిన పడతారు
వాస్తవం: పోషకాహారం బాగా తీసుకుంటే తల్లి పాల ద్వారా శిశువుకి పోషకాలు చక్కగా అందుతాయి. పాలిచ్చే తల్లులు రాత్రిపూట లేదా చలికాలంలో పెరుగు తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా జలుబు ఉండదు. పెరుగులోని క్రియాశీల బ్యాక్టీరియా వ్యాధిని కలిగించే జెర్మ్స్ తో పోరాడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. పేగులని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని విటమిన్లు, ప్రోటీన్లు, లాక్టోబాసిల్లస్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
అపోహ: బరువు తగ్గాలని అనుకుంటే పెరుగు తీసుకోవద్దు
వాస్తవం: అది కేవలం అపోహ మాత్రమే. బరువు తగ్గాలని అనుకుంటే తప్పనిసరిగా పెరుగు భోజనంలో చేర్చుకోవాల్సిందే. పెరుగులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇవి ఇన్ఫెక్షన్లని దూరం చేస్తాయి. తక్కువ కొవ్వు పాలతో చేసిన పెరుగు తీసుకుంటే సంతృప్త కొవ్వులని పెంచాడు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి అందుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు