Breast Cancer: రొమ్ము క్యాన్సర్ మళ్ళీ తిరగబెడుతుందా? దాని లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?
రొమ్ము క్యాన్సర్ కి చికిత్స తీసుకున్నప్పటికి తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
చర్మ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చేది రొమ్ము క్యాన్సర్. దీనికి చికిత్స తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం రొమ్ము క్యాన్సర్ లో భాగంగా రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. రొమ్ము క్యాన్సర్లు వివిధ రకాలు ఉన్నాయి. రొమ్ములోని ఏ కణాలు క్యాన్సర్ గా మారతాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మామోగ్రామ్ ద్వారా ఈ కణాలు గుర్తించొచ్చు. 50 ఏళ్లు పైబడిన మహిళలని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది?
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రకారం ఇది వివిధ భాగాల్లో వృద్ధి చెందుతుంది.
లోబుల్స్: పాలని ఉత్పత్తి చేసే గ్రంథులు
నాళాలు: చనుమొలకి పాలని తీసుకెళ్ళే గొట్టాలు
కనెక్టివ్ టిష్యూ: ఇది రొమ్ములోని కణాలు అన్నింటినీ కలిపి ఉంచే ఫైబరస్, కొవ్వు కణజాలం
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం చాలా రొమ్ము క్యాన్సర్లు నాళాలు లేదా లోబుల్స్ లో ప్రారంభమవుతాయి.
రొమ్ము క్యాన్సర్ ఎందుకు పునరావృతం అవుతుంది?
చికిత్స చేసిన తర్వాత కూడా రొమ్ము క్యాన్సర్ తిరిగి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని క్యాన్సర్ కణాలు తొలగింపు సమయంలో నిద్రాణ వ్యవస్థలో ఉంటాయి. ఇవి PET స్కాన్, మామోగ్రఫీ లేదా మైక్రోస్కోప్ లో కనిపించవు. అవి జీవించి ఉంటాయి. చికిత్స తీసుకున్న కొన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయి.
పునరావృతమయ్యే రకాలు ఏంటి?
⦿ రొమ్ము క్యాన్సర్ మూడు రకాలుగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
⦿ తొలుత ఏ రొమ్ములో అయితే క్యాన్సర్ కణితి ఉంటుందో దాంట్లోనే తిరిగి రావొచ్చు.
⦿ లేదంటే చంకలో లేదా భుజం చుట్టూ ఉన్న శోషరస కణుపుల్లో తిరిగి రావొచ్చు.
⦿ రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడు వంటి శరీరంలోని ఇతర భాగాలకి వ్యాపించినప్పుడు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఇది మెటాస్టాటిక్ క్యాన్సర్ లేదా స్టేజ్ 4 క్యాన్సర్ అని పిలుస్తారు.
పురావృతమైన క్యాన్సర్ లక్షణాలు
రొమ్ము క్యాన్సర్ గతంలో వచ్చిన ప్రదేశంలోనే మళ్ళీ రావొచ్చు. లేదంటే ఇతర భాగాలకి వ్యాపించవచ్చు. లంపెక్టమీ చేయించుకున్నట్లయితే రొమ్ము కణజాలంలో క్యాన్సర్ మళ్ళీ రావచ్చు. మాస్టెక్టమీని నిర్వహించినట్లయితే ఛాతీ లేదా చర్మ కణజాలంలో క్యాన్సర్ తిరిగి రావచ్చు.
లక్షణాలు
☀ రొమ్ములో కొత్తగా ముద్ద తగలడం
☀ రొమ్ము చర్మంలో మార్పులు
☀ చర్మం వాపు లేదా ఎర్రగా అవడం
☀ చనుమొల నుంచి రక్తం లేదా ద్రవం రావడం
☀ రొమ్ములో నొప్పి
☀ మాస్టెక్టమీ మచ్చ వెంట లేదా సమీపంలో కొత్తగా గడ్డగా అనిపించడం
☀ నిరంతరం దగ్గు
☀ బరువు తగ్గడం
☀ తీవ్రమైన తలనొప్పి, ఒక్కోసారి మూర్చలు రావడం
☀ ఆకలి లేకపోవడం
☀ శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం
☀ కామెర్లు
☀ ఎముకల నొప్పులు
☀ జ్వరం, చలి లేదా దగ్గు
☀ వికారం, వాంతులు, విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు
హెల్త్ లైన్ ప్రకారం రొమ్ము క్యాన్సర్ పునరావృతం అనేది చికిత్స తీసుకున్న ఐదు సంవత్సరాలలో జరుగుతుంది. రేడియేషన్ థెరపీ తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చికిత్స తీసుకున్న పదేళ్ళ లోపు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 3-15 శాతం ఉంటుందని సీడీసీ చెబుతోంది.
క్యాన్సర్ పునరావృతం కాకుండా ఎలా నిరోధించాలి?
రొమ్ము క్యాన్సర్ పునరావృతమయ్యే చికిత్స క్యాన్సర్ రకం, దాని ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. సమస్య ఆధారంగా ఈ కింది చికిత్స విధానాలు పాటిస్తారు.
- మాస్టెక్టమీ
- కీమోథెరపీ
- హార్మోన్ థెరపీ
- ఇమ్యునోథెరపీ
- రేడియేషన్ థెరపీ
- టార్గెట్ థెరపీ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవల్సిందే