Best Foods for Eyes : కళ్లు మసకబారిపోతున్నాయా? అయితే డైట్లో ఈ ఫుడ్ తీసుకోండి.. పిల్లల నుంచి పెద్దలవరకు
Eye Care Foods : కంటి ఆరోగ్యం కోసం కొన్ని ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇవి ఎంతవరకు మంచివో చూసేద్దాం.

Foods for Best Vision : ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ కంటి సమస్యలు వస్తున్నాయి. తీసుకునే ఆహారం, స్క్రీన్ సమయం, ఒత్తిడి వంటి వివిధ కారణాలు కంటి చూపుపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే స్క్రీన్ సమయం తగ్గించుకోవడంతో పాటు.. తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మీరు తీసుకునే ఆహారం ప్రభావం మీ కంటిపై పడుతుందని చెప్తున్నారు. జీవితాంతం స్పష్టమైన, ఆరోగ్యకరమైన దృష్టిని కాపాడుకోవాలనుకుంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు డాక్టర్ సౌరభ్ మాలిక్. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కళ్లకు మంచిదో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఐ స్పెషలిస్ట్ సౌరభ్ ఇచ్చే సూచనలు ఏంటో చూసేద్దాం.
యాంటీఆక్సిడెంట్ల కోసం..
డైట్లో బచ్చలికూర, కాలే, మొక్కజొన్నలో కనిపించే లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు కంటికి సహజమైన రక్షణగా పనిచేస్తాయి. హానికరమైన నీలి కాంతిని గ్రహించి రెటీనా కణాలను రక్షిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్దలలో దృష్టి లోపానికి ప్రధాన కారణాలలో ఒకటైన వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత (AMD) ప్రమాదాన్ని గణనీయంగా తగ్గుతాయి. రెటీనా కేంద్ర భాగమైన మాక్యులా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
చిన్న పోషకాలు.. పెద్ద ప్రభావం
రోడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్ ఎ అవసరం. ఇది మన కళ్లు మసకబారడాన్ని తగ్గిస్తుంది. దీని లోపం ఎక్కువ అయితే రేచీకటి, పొడి కళ్లు సమస్యలు వస్తాయి. మీ ఆహారంలో క్యారెట్లు, బొప్పాయి, స్వీట్ పొటాటో చేర్చుకోవడం వల్ల విటమిన్ ఎ, తగినంత బీటా-కెరోటిన్ స్థాయిలు అందుతాయి. విటమిన్ సి (సిట్రస్ పండ్లు, ఉసిరి, జామ) తీసుకోవాలి. అలాగే విటమిన్ ఇ (గింజలు, విత్తనాలు) తీసుకోవాలి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శుక్లాల ఏర్పడటాన్ని ఆలస్యం చేస్తాయి. కంటి కణజాలాల మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. కాయధాన్యాలు, గుమ్మడికాయ గింజలు, శెనగలలో ఉండే జింక్ కళ్లకు విటమిన్ ఎ అందిస్తాయి.
ఒమేగా-3.. స్పష్టమైన చూపుకోసం
వాల్‌నట్‌లు, అవిసె గింజలు, సాల్మన్ వంటి చేపలలో ఒమేగా-3ల వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కన్నీటి పొరను స్థిరీకరించడానికి, పొడి కంటి లక్షణాలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. రెటీనా ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. రక్త నాళాల సమగ్రతకు మద్దతు ఇవ్వడం ద్వారా డయాబెటిక్ రెటినోపతి నుంచి కూడా రక్షించుకోవచ్చు.
రోజువారీ సంరక్షణ
ఇవేకాకుండా ఎండలో బయటకు వెళ్లేప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గిచండం చేయాలి. అలాగే కళ్లకు కొన్ని వ్యాయామాలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. కంటి సమస్య మొదలవుతుందని మీకు అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేకుండా వైద్యులను సంప్రదించండి. దీనివల్ల సమస్యను ఆదిలో నివారించగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక కంటి సమస్యలు దూరంగా ఉంటాయని సూచిస్తున్నారు.






















