Banana Pancake: పిల్లలకు నచ్చే బ్రేక్ ఫాస్ట్ బనానా పాన్ కేక్
Banana Pancake: పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్రేక్ ఫాస్ట్‌లు తయారు చేయడం కష్టమే. ఒకసారి ఈ బనానా పాన్ కేక్ పెట్టి చూడండి.
Banana Pancake: లంచ్ బాక్స్‌లో ఇష్టమైనవి పెడితేనే పిల్లలు తినడానికి ఆసక్తి చూపిస్తారు. లేకపోతే సాయంత్రం తిరిగి అవే బాక్సులు వెనక్కి వస్తాయి. పిల్లల పొట్ట ఖాళీగానే ఉంటుంది. ఎప్పుడూ దోశ, ఉప్మా, ఇడ్లీ ఇవే పెడితే వారికి బోర్ కొట్టేస్తుంది. ఓసారి అరటి పండ్లతో పాన్ కేక్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాస్త తీయతీయగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. దీన్ని బనానా చీలా అని పిలుస్తారు నార్త్ ఇండియన్స్. విదేశాల్లో అయితే బనానా పాన్ కేక్స్ అంటారు. అరటిపండు గోధుమపిండి కలిపి ఈ అట్లను వేస్తారు. కాబట్టి మెత్తగా వస్తాయి. పోషకాలు కూడా ఎక్కువే. శక్తిని అందిస్తాయి. వీటిని చేయడం చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
పాలు - అర కప్పు
అరటి పండ్లు - రెండు
తేనె - రెండు స్పూన్లు
నెయ్యి - ఒక స్పూను
తయారీ ఇలా
బాగా పండిన అరటి పండ్లతో ఈ పాన్ కేక్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీలో అరటిపండ్ల ముక్కలను పాలు వేసి మెత్తటి పేస్టులాగా చేయండి. ఒక గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని తీసుకోండి. రెండు స్పూన్ల తేనెను వేసి బాగా కలపండి. ఇప్పుడు అదే గిన్నెలో గోధుమపిండి కూడా వేసి బాగా కలపండి. అట్లులా పోసుకునేలా మిశ్రమం రావాలి. అవసరం అయితే నీళ్లు లేదా పాలు కలుపుతూ ఉండండి. అట్లు పోసుకోవడానికి వీలుగా మిశ్రమం తయారయ్యాక స్టవ్ మీద పెనం పెట్టండి. పెనంపై కాస్త నెయ్యి రాసి వేడి కానివ్వండి. అరటిపండ్ల మిశ్రమాన్ని కాస్త మందంగా అట్లు పోసుకోండి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చండి. తర్వాత పిల్లలకు ఇవ్వండి. ఈ అట్లు తీపిగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేదు. పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతాయి.
ఈ బనానా పాన్ కేక్‌లో పాలు, అరటి పండ్లు, తేనె, గోధుమపిండి, నెయ్యి ఇలా పిల్లలకు శక్తినిచ్చే ఆహారాలే ఉన్నాయి. కాబట్టి వారికి రోజంతా శక్తి అందుతుంది. వారు చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి వారి ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. గుండెకు కూడా పొటాషియం చాలా అవసరం. ఈ బనానా పాన్ కేక్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హైబీపీతో బాధపడుతున్న వారు అరటి పండ్లు తినాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా హైబీపీతో బాధపడుతున్న పెద్దవాళ్లు కూడా బనానా పాన్ కేక్‌ను తినడానికి ప్రయత్నించండి. అరటిపండు తినడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. వెంటనే శక్తిని కూడా ఇస్తుంది. ఒక్కసారి ఈ బనానా పాన్ కేక్ తినడం ప్రారంభిస్తే మళ్లీమళ్లీ మీరే తింటారు. చలికాలంలో బనానా పాన్ కేక్ వేడిగా తినడం చాలా ముఖ్యం. ఇందులో వేసిన తేనె రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Also read: గుండె వ్యాధి ఉన్నవారు తప్పకుండా తాగాల్సిన ఐదు పానీయాలు ఇవే
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అర్థం