Visakha Agni veer Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విశాఖలో 18 రోజుల పాటు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ
Visakha Agniveer Recruitment : విశాఖలో అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. నగరంలో 18 రోజుల పాటు ఆర్మీ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అన్ని జిల్లాలను అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విశాఖకు వస్తున్నారు.
Visakha Agniveer Recruitment : విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 14 నుంచి 31వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని అధికారులు ప్రకటించారు. విశాఖలో 18 రోజుల పాటు అగ్ని వీర్ నియామకాలకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. నియామక ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. రన్నింగ్ ట్రాక్ పై నీరు, బురద లేకుండా ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అగ్ని వీర్ నియామక ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున కోరారు.
భారీ బందోబస్తు
ఈ నియామక ర్యాలీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన తేదీల వారీగా హాజరు కావాలని అధికారులు సూచించారు. మొదటిరోజు రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే అభ్యర్థులు స్టేడియానికి చేరుకున్నారు. రాత్రంతా స్టేడియం పరిసరాల్లోనే అభ్యర్థులు ఉన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని పగడ్బందీగా నిర్వహించేందుకు 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు 500 మందికి పైగా పోలీసులను బందోబస్తుగా ఏర్పాటుచేశారు. పరీక్షలు జరిగే స్టేడియం లోపల, అభ్యర్థులు వచ్చే మార్గాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల కోసం సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో పాటు మెడికల్, రెవెన్యూ సిబ్బందిని కూడా అదనంగా నియమించారు. ఈ ఆర్మీ ర్యాలీ విజయవంతంగా నిర్వహించాలని ఆర్మీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అగ్నిపథ్‌కు ఎవరు అర్హులు?
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట అగ్నిపథ్. సైనికుల నియామకంలో కొత్త ఒరవడికి ఇది నాంది పలుకుతుందని కేంద్రం చాలా గట్టిగా చెబుతోంది. యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మొదటి విడతలో 46 వేల మందిని సైనికులుగా తీర్చి దిద్దుతామంటూ వెల్లడించింది కేంద్రం. త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు వీళ్లు విధులు నిర్వర్తిస్తారు. సైన్యంలోకి యువరక్తాన్ని ఆహ్వానించటం ద్వారా భారత్ మరింత శక్తిమంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పైగా రెగ్యులర్ సైనికులకు అందించే పెన్షన్లు, జీతాలు కోసం చేసే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ అగ్నిపథ్ సర్వీస్‌లో చేరేందుకు 17.5-23 ఏళ్ల వాళ్లు అర్హులు. ఎంపికైన వారికి ఆర్నెల్ల పాటు శిక్షణ అందించి మూడున్నరేళ్ల పాటు సర్వీసులో ఉంచుతారు. ఈ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మంచి ప్యాకేజీ కూడా అందిస్తారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్నిపథ్ సర్వీస్‌ని ప్రారంభించాలని ఐడియా 2020లోనే వచ్చిందట. ఇది మాజీ సైనికాధ్యక్షుడు బిపిన్ రావత్ ఆలోచన. సైన్యం కోసం చేస్తున్న ఖర్చుని వీలైనంత వరకూ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేశారట.
Also Read : Agnipath Scheme: అగ్నివీరులకు మరో ఆఫర్ ఇచ్చిన కేంద్రం, ఆ బలగాల్లో చేరే వారికి రిజర్వేషన్లు