TS Police Physical Events: ఎత్తు పెంచుకునేందుకు మహిళా అభ్యర్థి ప్లాన్, ఆమెను డిస్ క్వాలిఫై చేసిన ఎస్పీ
మహిళా అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు, ఎత్తు చెక్ చేస్తుండగా ఓ అభ్యర్థిని పరీక్షించిన పోలీసులు షాకయ్యారు. ఎత్తు పెంచుకునేందుకు యువతి చేసిన ప్రయత్నం విఫలమైంది.
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్.ఐ. పోస్టుల ఎంపికలో భాగంగా బుధవారం ఉదయం మహిళా అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు, ఎత్తు చెక్ చేస్తుండగా ఓ అభ్యర్థిని పరీక్షించిన పోలీసులు షాకయ్యారు. ఎత్తు పెంచుకునేందుకు యువతి చేసిన ప్రయత్నం విఫలమైంది. పోలీస్ ఉన్నతాధికారులు మహిళా అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎత్తు పెంచుకునేందుకు మహిళ తన జుట్టులో ఓ పదార్థాన్ని వాడారు. కానీ పోలీసులు ఆమె ప్రయత్నాన్ని విఫలం చేసి, ఎట్టా పట్టుకున్నారో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా బుధవారం ఉదయం 5.00 గంటల నుండే ప్రారంభం అయ్యాయి. ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం.చేతన IPS స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి పరీక్షలలో మహిళా అభ్యర్థులకు ఎత్తు కొలిచే సందర్భంలో ఒక అభ్యర్థి తల జుట్టు లోపల ఎంసీల్ మైనం పెట్టుకుని పరీక్షలకు హాజరైంది. తన ఎత్తును పెంచుకునేందుకు మహిళా అభ్యర్థి చేసిన ప్రయత్నాన్ని అధికారులు గుర్తించారు. ట్యాంకులు, పైపుల లీకేజీని అరికట్టేందుకు వినియోగించే ఎంసీల్ తలపై జట్టులో పెట్టుకుని పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి మహిళా అభ్యర్థి దొరికిపోయింది.
అలా దొరికిపోయిన మహిళా అభ్యర్థి..
ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ యంత్ర పరికరంపై మహిళా అభ్యర్థి నిలుచున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ పరికరంలోని సెన్సర్ స్పందించలేదు. ఇది గమనించిన మహిళా అధికారి అభ్యర్థి తలపై ప్రత్యేకంగా పరిశీలించగా, సదరు అభ్యర్థి తలపై జుట్టు లోపల M-సీల్ మైనం అతికించుకున్నట్లుగా గుర్తించారు. తలపై ఉబ్బెత్తుగా మైనం పెట్టుకుని తన ఎత్తు ఎక్కువ చూపేందుకు ప్రయత్నం చేసిన మహిళా అభ్యర్థిని పోలీస్ ఉన్నతాధికారులు డిస్ క్వాలిఫై చేశారు.
ఎంపిక ప్రక్రియలో ఆధునిక టెక్నాలజీతో పాటుగా సి.సి. కెమెరాలు, పోలీస్ అధికారుల నిశిత పరిశీలన ఉంటుందని, ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు అభ్యర్థులను హెచ్చరించారు. అభ్యర్థి ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ పరికరంపై నిలుచున్నప్పుడు, తలపై మరియు కాళ్ళ కింద పూర్తిస్థాయిలో సరైన స్పర్శ ఉన్నప్పుడే సెన్సర్లు స్పందిస్తాయి. అప్పుడే అభ్యర్థుల ఎత్తు, బరువు సూచిస్తాయని తెలిపారు. అదేవిధంగా పరుగు పోటీ, ఇతర ఈవెంట్లలో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ విధానాన్ని ఉపయోగిస్తున్న విషయం ఎస్పీ వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత సత్తువపై నమ్మకంతో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించేందుకు కృషి చేయాలని ఇలాంటి తప్పిదాలకు పాల్పడి చిక్కుల్లో పడరాదని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 12 మైదానాల్లో జనవరి 3 వరకు జరిగే ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఎలాంటి అవకతవకలు, తప్పులకు ఆస్కారం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బయో మెట్రిక్, ప్రతి అభ్యర్థి చేతికి చిప్‌తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్ చిప్‌తో ఉన్న ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్‌ను అటాచ్ చేయనున్నారు. వీటి ద్వారా ఈవెంట్స్ పారదర్శకంగా జరిగేలా పక్కాగా ఏర్పాట్లు చేశారు.
ముందుగా అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులకు టోకెన్ నెంబర్ ఇచ్చి ప్రాంగణంలోకి అనుమతిస్తారు. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. బయోమెట్రిక్ తర్వాత రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్ అటాచ్ చేసుకున్న పురుష అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.