TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, రేపటి నుంచే ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
DSC 2024: తెలంగాణ డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికచేయనున్నారు. అక్టోబరు 1 నుంచి 5 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
TG DSC 2024 Certificate Verification: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీక నిర్వహించిన డీఎస్సీ-2024 ఫలితాలు సెప్టెంబరు 30న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 1 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసినట్లు ఆయన ఆయన వెల్లడించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇవ్వనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను సంబంధిత డీఈఓలు ప్రకటిస్తారని ఆయన తెలిపారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలని స్ఫష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీటి ఫలితాలు సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి. మెరిట్ ఆధారంగా.. ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా సంబంధిత డీఈవోలకు ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్ ర్యాంకులను వెల్లడించారు.
పోటీ ఎక్కువే..
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్ మూడో స్థానంలో నిలిచింది. అక్కడ ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం.
నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకుగాను.. 6,508 ఎస్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు, స్పెషల్ కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు , 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.