TSPSC Junior Lecturer Result: జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
TSPSC JL Results 2024: జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
TGPSC Junior Lecturers in Economics Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పరిధిలోని కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ ఉర్దూ మీడియం పోస్టులకు సంబంధించిన ఎంపిక ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 87 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో మల్టీజోన్-1 పరిధిలో 36 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో ఉర్దూమీడియంలో నలుగురు ఎంపికయ్యారు. ఇక మల్టీజోన్-2 పరిధిలో 48 మంది అభ్యర్థులు ఉండగా.. ఉర్దూమీడియంలో ముగ్గురు అభ్యర్థులు ఎంపికయ్యారు.
జేఎల్ ఎకనామిక్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
జూనియర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ జులై 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సబ్జెక్టులవారీగా ఇచ్చారు. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి జూనియర్ లెక్చరర్స్ జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల (Junior Lecturers) భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 9, 2022న నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1 లో 724 పోస్టులు, మల్టీ జోన్-2 లో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి 2023, జనవరి 6 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్ నిర్వహించారు. మధ్యాహ్నం అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను కమిషన్ విడుదల చేసింది. ఇందులో ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. సబ్జెక్టులవారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేస్తోంది. తాజాగా ఎకనామిక్స్ సబ్జెక్టు తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డిసెంబరు మొదటి వారంలో గ్రూప్-4 నియామక పత్రాలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచిన నేపథ్యంలో.. ప్రజాపాలన విజయోత్సవాలకు రేవంత్ సర్కార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లో వీటిని జరిపేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన టీజీజీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాల్లో ఉద్యోగాలు సంపాదించిన వారికి సీఎం రేవంత్ తీపి కబురు చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 4న పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. అదే వేదికగా గ్రూప్-4తో పాటు, వివిధ నియామకాల ద్వారా ఎంపికైన దాదాపు 9 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.