(Source: ECI/ABP News/ABP Majha)
TGPSC JL Results: జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడి, ధ్రువపత్రాల పరిశీలనకు 2724 మంది అభ్యర్థులు ఎంపిక
JL Results: తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టులవారీగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
TGPSC Junior Lecturers Certificate Verification: తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ (JL) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అర్హత సాధించి, ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జులై 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలను సబ్జెక్టులవారీగా అందుబాటులో ఉంచింది. మొత్తం 2724 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికయ్యారు.
జనరల్ ర్యాంకింగ్ జాబితా నుంచి ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను కమిషన్ ఎంపికచేసింది. అయితే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. మొత్తం 1392 ఉద్యోగాలకుగాను 2724 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 11 వరకు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభంకానుంది. అభ్యర్థులు తప్పనిసరిగా కమిషన్ సూచించిన ప్రకారం అన్ని అవసరమైన సర్టిఫికేట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, తేదీల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబరు 9న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 16 నుంచి 2023, జనవరి 6 2024 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు.
మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆన్సర్ కీని సెప్టెంబరు 23 నుంచి విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాతపరీక్షకు సంబంధించిన అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 8న విడుదలచేసింది. తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను తేదీలవారీగా వెల్లడించింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి.
6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో.
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
10) పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి.
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి.
13) నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి.