TGPSC Group1 Halltikets: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల - పరీక్ష వివరాలు, అభ్యర్థులకు మార్గదర్శకాలివే
Group1 Prelims Halltikets: తెలంగాణలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమీషన్( టీజీపీఎస్సీ) జూన్ 1న విడుదల చేసింది.
TGPSC Group1 Prelims Halltikets Download: తెలంగాణలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ జూన్ 1న మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గత అనుభవాల నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు అభ్యర్థులకు కఠిన నిబంధనలు విధించింది. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
Group1 Services Download Halltickets
పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు). ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులలో నిర్ణీత నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు.
పరీక్ష కేంద్రాలు..
ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.
అభ్యర్థులకు మార్గదర్శకాలు..
➥ టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట పరీక్ష హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఫొటోఐడీ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాలి. ఫొటో సరిగాలేని హాల్‌టికెట్లను పరిగణనలోకి తీసుకోరు. వారిని అనుమతించరు.
➥ అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ మీద ఫొటో సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు.
➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్‌లోకి పంపిస్తారు. ఉదయం 10 గంటలకు గేట్లను మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమితించరు. ఉదయం 9.30 గంటల నుంచే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.
➥ హాల్‌టికెట్ మీద ఫొటో సరిగాలేని అభ్యర్థులు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లడం మంచింది.
➥ పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డిజిటల్ వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, రైటింగ్ పాడ్, నోట్స్, చార్టులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించరు.
➥ అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని పరీక్షకు హాజరుకావాలి. షూ వంటివి ధరించకూడదు.
➥ OMR విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు, కాబట్టి అందులోని వివరాలను, సమాధానాలు బబ్లింగ్ చేయడానికి బ్లాక్ లేదా నీలం రంగు పెన్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లు వాడకూడదు.
➥ OMR పత్రంలో సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన, వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే పత్రాలు చెల్లుబాటు కావు.
➥ ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వరు.
➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
Related Article:
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - ఫొటోగ్రాఫ్, పేరు వివరాల్లో తప్పులుంటే ఇలా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే