TSPSC News: టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఛైర్మన్, సభ్యులు నియామకానికి నోటిఫికేషన్
Telangana Public Service Commission: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. ఈ మేరకు కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSPSC Latest News: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఛైర్మన్, సభ్యులు నియామకానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఇప్పటి వరకు ఛైర్మన్ గా కొనసాగిన బి జనార్ధన్‌రెడ్డి, సభ్యులు ఆర్‌సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేయడం, వాటిని గవర్నర్ తమిళ సై ఆమోదించడంతో చకాచకా జరిగిపోయాయి. వీరి రాజీనామాలు ఆమోదం పొందడంతో కొత్త ఛైర్మన్, సభ్యులు నియామకాన్ని వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృస్టి సారించి ఆ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆశావహులు నుంచి దరఖాస్తులను కోరుతోంది.
పేపర్ లీకేజీ వ్యవహారంతో రచ్చ..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చేపట్టిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలతోపాటు కమిషన్ నిర్వహించిన పలు పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట మంటగలిసిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంపై విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు పేపర్ లీకేజీ వ్యవహారానికి కారణమైన సుమారు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మిగిలిన వారి పాత్రపైనా విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో పాత్రదారులు, సూత్రదారులపైనా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఛైర్మన్ సహా సభ్యులు రాజీనామా చేయగా, గవర్నర్ ఆమోదం తెలిపారు.
యూపీఎస్సీ తరహాలో అమలుకు..
గతంలో టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజీతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం.. యూపీఎస్సీ తరహాలో ఖాళీలు భర్తీ చేసేందుకు అనుగుణంగా యోచించింది. అదే సమయంలో కేరళలో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కార్యదర్శితోపాటు ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ వెళ్లింది. వీరు అందించే నివేదిక ఆధారంగా మార్పులను ప్రభుత్వం చేయనుంది.
నిరుద్యోగుల ఆగ్రహంతో బీఆర్ఎస్ ఓటమి..
టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంతో గత బీఆర్‌ఎస్ సర్కారు ప్రతిష్ట మంటగలిసింది. నిరుద్యోగులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగుల ఆగ్రహమే కారణంగా చెబుతారు. ఇది గమనించిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా హామీలను ప్రకటించారు. ప్రభుత్వ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో విద్యార్థుల ఆవేదనకు కారణమైన టీఎస్‌పీఎస్సీ(TSPSC)ని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త ఛైర్మన్ , సభ్యులు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.