Singareni Jobs 2022: రేపే సింగరేణి ఉద్యోగాలకు ఎగ్జామ్, హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నారా
Singareni Jobs 2022: ఆరు జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్ధుల మద్య భారీగా పోటీ నెలకొంది. రేపు పరీక్షలు నిర్వహించడానికి అంతా సిద్ధం చేశారు.
Singareni Junior Assistant Jobs: ప్రభుత్వ కొలువులకు అభ్యర్ధుల మధ్య పోటీ అధికంగా ఉంటుంది. సింగరేణి క్లరికల్ (జూనియర్ అసిస్టెంట్) పోస్టులకు నిర్వహిస్తున్న రాత పరీక్షలు కూడా అదే విధంగా ఉన్నాయి. మొత్తం 177 పోస్టులకు జరుగుతున్న ఎగ్జామ్ కు ఇప్పుడు 98,880 మంది అభ్యర్ధులకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరు జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించాలన్న తపన ఓ వైపు మరోవైపు ప్రభుత్వ నియామకాలు తక్కువగా ఉండటం, నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ పోస్టుల కోసం భారీగానే ధరఖాస్తులు వచ్చాయి. ఒక్కొ పోస్టుకు సగటున 550 మందికి పైగానే పోటీ పడుతున్నారు. ఇప్పటికే హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్ధులు ఆదివారం జరిగే పరీక్షలకు సిద్దమయ్యారు. Junior Assistant Grade-II (External) Hall Ticket Download
187 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..
సింగరేణి రాత పరీక్ష కోసం యాజమాన్యం 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో రెండు రీజియన్లు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొత్తగూడెం సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌లోనే 39 సెంటర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. కొత్తగూడెంలో 35 సెంటర్లు, మంచిర్యాలలో 28, ఖమ్మంలో 23, హైదరాబాద్ –1లో 19, హైదరాబాద్ –2లో 14, వరంగల్‌లో 18, ఆదిలాబాద్‌లో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కొ రీజియన్‌కు పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు.
నెగెటివ్ మార్కులు సైతం..
జూనియర్ అసిస్టెంట్ పరీక్షలకు భారీగా ధరఖాస్తులు రావడంతో సింగరేణి యాజమాన్యం ఈ సారి నెగెటివ్ మార్కుల నిబందన రూపొందించింది. మరోవైపు 120 మార్కులకు ఉండే ఈ పరీక్షలకు కేవలం రెండు గంటల సమయంతోపాటు నెగెటివ్ మార్కులను ఏర్పాటు చేయడం గమనార్హం. తప్పు సమాదానం ఇస్తే మార్కులు తగ్గుతాయి. పోటీ భారీగా ఉండటంతో పాటు ఇప్పటికే అభ్యర్ధులు వివిద కోచింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ తీసుకోవడంతోపాటు ఎలాగైనా సింగరేణి ఉద్యోగం సంపాదించాలనే కోరికతో ప్రిపేర్ అవుతున్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. పేరుకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయినప్పటికీ భారీ పోటీ నేపథ్యంలో గ్రూప్ –1 స్థాయిలో పేపర్ ఉండవచ్చని అభ్యర్ధులు అంచనా వేస్తున్నారు.
Also Read: Singareni JA Exam: వెబ్‌సైట్‌లో జూనియర్ అసిస్టెంట్ పరీక్ష హాల్‌టికెట్లు, డౌన్‌లోడ్ చేసుకోండి!
పరీక్షల కోసం గట్టి నిఘా..
2015లో సింగరేణి సంస్ధ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్ మెంట్‌లో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్ చేస్తూ కొంత మంది దొరక్కడంతో ఈ దపా ఎలాంటి అవతవకలు జరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం పరీక్షల నిర్వహణపై దళారుల మాటలు నమ్మవద్దని ప్రచారం చేయగా మరోవైపు పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నారు.
వరుసగా రెండు సార్లు జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా 177 పోస్టుల కోసం ఏకంగా లక్షల మందికిపైగానే ధరఖాస్తు చేసుకోవడం, 98,880 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతుండటంతో ఈ సారి సింగరేణి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.