Railway Recruitment 2026: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, 22 వేల పోస్టులు భర్తీ చేస్తున్న రైల్వేశాఖ.. పూర్తి వివరాలు
Railway Jobs 2026: 10వ తరగతి పాస్ అయిన వారికి రైల్వేలో ఉద్యోగావకాశం లభించింది. రైల్వే గ్రూప్ డి 22 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. త్వరలో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. రైల్వేలో ఉద్యోగం చేయాలని లక్షలాది మంది యువకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 22 వేల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్ D లెవల్-1 పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తి చేసింది. త్వరలో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు అధికారులు కసరత్తు చేశారు. ఇది అతిపెద్ద రైల్వే భర్తీలలో ఒకటిగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. దీని ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం లభించనుంది.
ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా రైల్వేలో పాయింట్స్‌మ్యాన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్-IV వంటి పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇతర సాంకేతిక విభాగాలలో కూడా గ్రూప్ D లెవల్-1 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులన్నీ రైల్వే కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించినవి. వీటి పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అందించిన సమాచారం ప్రకారం, గ్రూప్ D లెవల్-1 భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభం అమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అవసరమైన అర్హతలు ఏమిటి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు అభ్యర్థికి ఐటీఐ (ITI) లేదా NAC సర్టిఫికేట్ ఉంటే, అది సాంకేతిక విభాగాలలో వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. టెన్త్ అర్హతతో కేంద్ర కొలువు అని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
వయోపరిమితి ఎంత ఉంటుంది?
రైల్వే గ్రూప్ D భర్తీకి అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఇచ్చారు. ఓబీసీ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 3 ఏళ్లు సడలింపు ఇచ్చారు. అయితే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ లభిస్తుంది.
జీతం వివరాలు
గ్రూప్ D లెవల్-1లో ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం లెవల్-1లో రూ. 18,000 బేసిక్ జీతం లభిస్తుంది. దీంతో పాటు, DA, ఇంటి అద్దె, రైల్వే ఇతర భత్యాలు కూడా లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ముందుగా అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రాయగా... ఆ తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) కోసం పిలుస్తారు. ఈ దశలో అభ్యర్థి ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షిస్తారు. PET పాస్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ టెస్ట్ చేస్తారు. చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అన్ని దశలలో దాటిన వారిలో మెరిట్ ప్రకారం పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఫీజు ఎంత చెల్లించాలి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ వర్గాల అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. అయితే, అభ్యర్థి CBT పరీక్షకు హాజరైతే, వారికి 400 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250 గా నిర్ణయించారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
రైల్వే గ్రూప్ D భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in సందర్శించి అందులో "New Registration" లేదా "Apply Online" ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ వివరాలని నమోదు చేయాలి. తర్వాత అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత ఫారమ్ సబ్మిట్ చేయాలి.






















