IIT Hyderabad Placements: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి బంపరాఫర్.. రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్‌మెంట్
IIT Hyderabad jobs | ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి జాక్ పాట్ కొట్టాడు. రూ. 2.5 కోట్ల వార్షిక వేతనంతో రికార్డు స్థాయి ఉద్యోగం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ విద్యార్థి అద్భుతం చేశారు. ఈ ఏడాది జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్ఘీస్‌కు నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ 'ఆప్టివర్' భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించిన ఎడ్వర్డ్, ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థిగా రికార్డు సృష్టించాడు.
గతంలో ఇదే కంపెనీలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసిన ఎడ్వర్డ్ ప్రతిభను గుర్తించిన సంస్థ, ఇప్పుడు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (PPO) కింద ఈ భారీ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌లో జన్మించిన 21 ఏళ్ల ఎడ్వర్డ్ నాథన్ బెంగళూరులో స్కూల్ పూర్తి చేశాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 558వ ర్యాంకు సాధించాడు.
ఐఐటీ హైదరాబాద్‌లో సీటు సంపాదించడమే కాకుండా, క్యాట్ (CAT) పరీక్షలో 99.96 పర్సంటైల్ సాధించి తన మేధస్సును చాటుకున్నాడు. ఎడ్వర్డ్ మాత్రమే కాకుండా, ఈ ఏడాది ప్లేస్‌మెంట్లలో మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఐఐటీ హైదరాబాద్ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచాడని అంతా ప్రశంసిస్తున్నారు.






















