Agnipath scheme: 'అగ్నిపథ్' స్కీమ్‌లో భారీ మార్పులు, విప్లవాత్మక మార్పుల దిశగా కేంద్రం అడుగులు?
Agnipath scheme: అగ్నిపథ్ స్కీమ్‌లో భారీ మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 2026 నాటికి అగ్నివీర్ ద్వారా 1.75లక్షల మంది యువతను ఆర్మీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Changes in Agnipath Scheme: ఎన్డీఏ పక్షాల డిమాండ్ల నేపథ్యంలో అగ్నిపథ్ స్కీమ్‌లో భారీమార్పులు చేసే దిశంగా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న సర్వీసును 7-8 ఏళ్లకు పెంచనుందని, వారిలో 60-70 శాతం మందిని పర్మినెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ గ్రేడ్‌లలో ప్రవేశాలకు వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచనుంది. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయినవారికి భారీ పరిహారం ఇవ్వడం, దేశసేవలో చనిపోయినవారి కుటుంబాలకు భత్యం తదితర అంశాల గురించి యోచిస్తున్నట్లు సమాచారం.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైనవారిని 'అగ్నివీర్లు'గా పిలుస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో పర్మినెంట్ చేస్తున్నారు. అయితే దీనిని 60 నుంచి 70 శాతంకు పెంచాలనే ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి అందాయి. అంతేకాకుండా.. సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు 'అగ్నిపథ్' పథకం కింద త్రివిధ దళాల్లో చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అగ్నిపథ్ పథకం కింద 17.5 - 21 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులను 'అగ్నివీర్' పోస్టులకు ఎంపికచేస్తున్నారు. అయితే సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్‌మెంట్ వయసు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష..
కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వ కొలువుదీరిన నేపథ్యంలో.. అప్పుడే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'అగ్నివీర్' పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జేడీయూ కోరింది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై అప్పట్లోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు చెలరేగాయి. ప్రతిపక్షాలు సైతం ఈ పథకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్ పథకం ద్వారా అగ్నీవీర్‌లను ఎంపిక చేసే ప్రక్రియను కేంద్రం యథావిధిగా కొనసాగించింది.
🔰ఇండియా కూటమిలో ప్రధానపార్టీగా కొనసాగుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన.
🔰 భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. తాజాగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో మిత్రపక్షాల ఒత్తిడిమేరకు ప్రభుత్వం మార్పులకు ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.