ATOS Recruitment: భారత్‌లో 15000 నియామకాలు.. నిరుద్యోగులకు 'అటోస్' గుడ్ న్యూస్
ATOS Jobs: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ అటోస్.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాబోయే 12 నెలల్లో ఇండియాలో 15,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ అటోస్ (ATOS) ఉద్యోగుల నియమకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది కాలంలో (12 నెలలు) భారతదేశంలో 15,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఉద్యోగులపై ఏటా 400 మిలియన్ పౌండ్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్’ (National Supercomputing Mission) కార్యక్రమంలో భాగంగా అటోస్ సంస్థ భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది.
నంబర్ 1 కావాలనే లక్ష్యంతో..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో (cyber security services) నంబర్ 1 కావాలనే లక్ష్యంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలీ గిరార్డ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్‌లో ఇప్పటికే 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని.. వీరికి అదనంగా భారీ సంఖ్యలో నూతన నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. డిజిటైజేషన్ (digitisation) కారణంగా దేశంలో భారీగా ఉద్యోగుల అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగం, డిఫెన్స్ తో సహా ఇతర రంగాలలో భారీగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధునాతన, భారీ సామర్థ్యం ఉన్న కంప్యూటర్లను తయారు చేయడం (assembly), వాటిని పరీక్షించడం (టెస్టింగ్) వంటి వాటిపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గిరార్డ్ పేర్కొన్నారు.
డిజిటల్ నైపుణ్యాలు భేష్..
ప్రపంచంలో అత్యుత్తమ నైపుణ్యాలు గల మానవ వనరులు కలిగిన దేశాలలో ఇండియా ఒకటని గిరార్డ్ అన్నారు. ఇండియాలో మెరుగైన డిజిటల్ నైపుణ్యాలు ఉన్నాయని.. ఈ కారణంగానే నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. అయితే ప్రస్తుతం డిమాండ్ సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో తమకు క్వాంటం ల్యాబ్ ఉందని, దేశంలో అద్భుతమైన డిజిటల్ శక్తి ఆధారంగా రాబోయే కాలంలో క్వాంటంలో నాయకత్వం వహించగలదని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. 5జీ టెక్నాలజీ వంటి తర్వాతి జనరేషన్ టెక్నాలజీలు నూతన అవకాశాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు.
మూడో వంతు ఆదాయం ఇండియా నుంచే..
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవల్లో తాము ముందంజలో ఉన్నామని గిరార్డ్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సేవల్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తాము రెండో స్థానంలో ఉన్నామని.. ఒకటి రెండేళ్లలో నంబర్ 1 స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో దాదాపు మూడో వంతు ఇండియా నుంచి వస్తున్నట్లు తెలిపారు.
Also Read: TCS Jobs: మహిళలకు టీసీఎస్ బంపర్ ఆఫర్.. ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు..