Group-1 Mains Coaching: 'గ్రూప్-1' మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్
Group1 Free Coaching: గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణ కోసం బీసీ స్టడీ సర్కిల్ దరఖాస్తులు కోరుతోంది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
Free Coaching for Group-1 Mains in BC Study Circle: తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TSBCESDTC) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జులై 9న ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారికి 75 రోజులపాటు శిక్షణ ఇస్తారు. గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 10 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్‌తో కింద రూ.5,000 ఇస్తారు. బుక్‌ఫండ్, ట్రాన్స్‌పొర్టేషన్ ఖర్చులను ఇందులోనే ఇస్తారు.
మొత్తం సీట్లలో 75 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు, ఈబీసీ& దివ్యాంగులకు 5 శాతం సీట్లను కేటాయిస్తారు. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నెం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో 75 రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. అభ్యర్థులు కుటుంబ ఆదాయ ధ్రువపత్రంతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు ఫోన్: 040- 24071178 లేదా 040-29303130 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.
మెయిన్స్‌కు 31,382 మంది అర్హత..
రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న టీజీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో జులై 7న విడుదల చేసింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.
గ్రూప్-1 మెయిన్స్ 2024 పరీక్షల షెడ్యూలు..
➥ 21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
➥ 22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
➥ 23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
➥ 24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
➥ 25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
➥ 26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
➥ 27.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)
పరీక్ష విధానం: మొత్తం 900 మార్కులకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్ష మాత్రమే పరిగణిస్తారు. ఇక మిగతా ఆరు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.