Fake Bonafide Certificates: నకిలీ బోనఫైడ్ల కలకలం - కానిస్టేబుల్ శిక్షణకు 350 మంది అభ్యర్థులు దూరం!
Telangana News: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Fake Bonafied Certificates in Telangana: తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 21న శిక్షణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 13,444 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీఎస్‌ఎస్‌పీకి చెందిన 5,010 మందికి మినహా సివిల్, ఏఆర్ తదితర విభాగాల వారికి ఫిబ్రవరి 21 నుంచి 9 నెలల శిక్షణ మొదలైంది. అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట సుమారు 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కనపెట్టారు. అనంతరం ప్రాథమిక విచారణలో 250 నిజమేనని తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేయిస్తున్నారు. వారు చదివిన పాఠశాలల రిజిస్టర్లతో సహా తనిఖీ చేయనున్నారు.
హైదరాబాద్ స్కూళ్లలో చదివినట్లుగా బోనఫైడ్లు..
సాధారణంగా హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులుంటాయి. దీంతో ఇక్కడి పాఠశాలల నుంచి నకిలీ బోనఫైడ్ తీసుకున్నట్లు స్పెషల్ బ్రాంచి అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండే ఒక పాఠశాల పదుల సంఖ్యలో అభ్యర్థులకు బోనఫైడ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు పాఠశాలలపైనా ఆరా తీస్తున్నారు.
స్థానికతే ప్రామాణికం..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 7 వరకు నాలుగు తరగతులు ఎక్కడ చదివి ఉంటే అక్కడి స్థానికుడిగా పరిగణిస్తారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పాఠశాలలు ఇచ్చే బోనఫైడ్‌లనే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లు.. అందులో ఒకటి హైదరాబాద్ జిల్లా ఉన్నట్లు పరిశీలనలో వెలుగుచూసింది. సుదూర ప్రాంతాలకు చెందిన వారు నగరంలో చదివినట్లు చూపడం.. అవి కూడా కొన్ని తరగతులే కావడంతో అనుమానాలకు బలం చేకూర్చింది. జీవో 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయించి నియామకాలు చేపడతారు.
శిక్షణకు 10 శాతం అభ్యర్థులు దూరం..
తెలంగాణలో కొత్తగా నియమితులైన పోలీస్ కానిస్టేబుళ్లకు గత నెల చివరివారంలో శిక్షణ ప్రారంభం కాగా.. ఇప్పటికీ పలువురు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిక్షణకు ఎంపికైన వారిలో సుమారు 10 శాతం మంది ఇంకా రిపోర్ట్ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శిక్షణ కళాశాలలు, నగర శిక్షణ కేంద్రాలు, జిల్లా శిక్షణ కేంద్రాలతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు అన్నీ కలిపి 28 కేంద్రాల్లో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 13,953 మంది కానిస్టేబుళ్లకుగాను తొలిదశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా.. మొదటిరోజు సుమారు 6,500 మంది మాత్రమే హాజరయ్యారు. మార్చి మొదటివారం ముగిసేనాటికి ఇంకా 900 మంది వరకు శిక్షణకు హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. కంటి పరీక్షల్లో జాప్యం వల్ల ఎక్కువమంది హాజరు కాలేకపోయినట్లు తేలింది. ఇతర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావడంతో పలువురు హాజరు కాలేదని చెబుతున్నారు. పెట్టీ కేసులు, నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు స్పెషల్ బ్రాంచి విచారణలో తేలడం వంటి కారణాలతో మరికొందరు శిక్షణకు అర్హత సాధించలేకపోయినట్లు అధికారులు అంటున్నారు.
భారీగా పెరగనున్న బ్యాక్‌లాగ్ పోస్టులు..
పోలీస్ నియామక మండలి(TSLPRB) 2022లో విడుదల చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారం.. సివిల్-4,965; ఏఆర్-4,423, ఎస్‌ఏఆర్ సీపీఎల్-100, టీఎస్‌ఎస్‌పీ-5,010, ఐటీ అండ్ కమ్యూనికేషన్-262, పీటీవో-121 ఉండగా.. ఈ లెక్కన అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అర్హులు లేకపోవడంతో 13,953 మందినే శిక్షణకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే 928 పోస్టులు బ్యాక్‌లాగ్ కింద మిగిలిపోయాయి. ఇప్పుడు శిక్షణకూ భారీ సంఖ్యలో గైర్హాజరవడంతో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిక్షణలో చేరేందుకు అభ్యర్థులకు ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించింది. ఆ లోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితేనే బ్యాక్‌లాగ్‌లపై స్పష్టత రానుంది.