హోంగార్డు అభ్యర్థులకు బిగ్ రిలీఫ్, 'కానిస్టేబుల్' పోస్టుల ఎంపిలో హైకోర్టు కీలక ఆదేశాలు!
కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి, ప్రాథమిక రాతపరీక్ష మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును కోర్టు ఆదేశించింది.
➥ పోస్టుల ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశం
➥మెరిట్ ఆధారంగా ఫిజికల్ ఈవెంట్లకు అనుమతించాలని స్పష్టీకరణ
ఏపీలోని పోలీసు విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి, ప్రాథమిక రాతపరీక్ష మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును కోర్టు ఆదేశించింది. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్, డీజీపీకి నోటీసులు జారీచేసింది. కౌంటరు దాఖలుచేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 2న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవడాన్ని సవాలుచేస్తూ సీహెచ్ గోపి, మరో ముగ్గురు హోం గార్డులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సాధారణ అభ్యర్థుల్లా తమకు కటాఫ్ మార్కులు నిర్ణయించడం సరికాదన్నారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించలేదని తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని చెప్పారు.
హోంగార్డు అభ్యర్థుల తరఫున న్యాయవాది జి.శీనకుమార్ వాదనలు వినిపిస్తూ.. కటాఫ్ మార్కుల విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా హోంగార్డులను పరిగణించకూడదని తెలిపారు. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి, దేహదారుఢ్య పరీక్షకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దన్నారు. కౌంటరు వేసేందుకు సమయం కావాలన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని, కటాఫ్‌తో సంబంధం లేకుండా హోంగార్డు అభ్యర్థుల ప్రాథమిక రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు.
Also Read: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డౌన్‌లోడ్ చేసుకోండి!
హైకోర్టుకు 80 మంది అభ్యర్థులు..
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నపత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలకు జవాబులు నిర్ణయించే అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించాలని కోరారు. జవాబులపై తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. గుంటూరు జిల్లాకు చెందిన జగం సహజ, మరో 79 మంది తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో మార్చి 3న విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో 6100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 30 నుంచి జనవరి 7 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. పరీక్షకు హాజరైన వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు.
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..