జీరో క్యాలరీ స్వీట్నర్స్, సుగర్ ఫ్రీలను అతిగా వాడేస్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్!
డయాబెటిస్, ఊబకాయం నుంచి తప్పించుకోడానికి ఈ మధ్య చాలామంది జీరో గ్యాలరీ స్వీట్నర్స్ వాడుతున్నారు. అయితే, అవి అతిగా వాడితే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు తగ్గేందుకు, షుగర్ అదుపులో ఉంచేందుకు జీరో క్యాలరీ స్వీటనర్స్ ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. కానీ వీటి వాడకం ప్రమాదకరం అని కొత్త అధ్యయనం చెబుతోంది.
ఎరిథ్రిటాల్ అని పిలువబడే షుగర్ రీప్లేస్మెంట్, స్టెవియా, మాంక్ ఫ్రూట్.. ఇవన్నీ కూడా కీటో రెడ్యూస్డ్ షుగర్ ప్రొడక్ట్స్. వీటి వాడకం వల్ల రక్తం గడ్డకట్టడానికి, స్ట్రోక్ సమస్యకు, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమవుతోందని కొత్త అధ్యయనం ద్వారా నిపుణులు వెల్లడి చేస్తున్నారు.
డయాబెటిస్, గుండెజబ్బులు వంటి సమస్యలు ఉన్న వ్యక్తుల రక్తంలో ఎరిథ్రిటాల్ అధిక స్థాయిలో ఉంటే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని నెచర్ మెడిసిన్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయన వివరాల్లో తెలిపింది. రక్తంలో ఎరిథ్రటాల్ 25 శాతం ఎక్కువగా ఉండి.. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నట్లయితే.. బాధితులకు స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం రెండింతలు పెరుగుతుందని హజెన్ అంటున్నారు.
ఎరిథ్రిటాల్ రక్తంలోని ప్లేట్ లెట్లు త్వరగా స్కందనం చెందేట్టుగా చేస్తుంది. ఈ క్లాట్స్ ముక్కలుగా మారి రక్తప్రవాహంలో కలిసి గుండెను చేరుకుంటే హార్ట్ ఎటాక్ రావచ్చు. లేదా మెదడుకు చేరితే స్ట్రోక్ రావచ్చు అని అడిషనల్ లాబ్ అండ్ ఆనిమల్ రీసెర్చ్ సమర్పించిన ఒక రిపోర్ట్‌లో తెలియజేశారు.
అసలు ఎరిథ్రిటాల్ అంటే ఏమిటి?
సార్బిటాల్, జిలిటాల్ మాదిరిగానే ఎరిథ్రిటాల్ కూడా ఒక షుగర్ ఆల్కాహాల్. చాలా పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉండే కార్బోహైడ్రేట్. చక్కెరతో పోల్చినపుడు 70 శాతం తియ్యగా ఉంటుంది. నిపుణులు ఇది జీరో కాలరీడ్ గా అభివర్ణిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. అంతేకాదు ఇతర ఆల్కహాల్ చక్కెరలు విరేచనం కలిగించే గుణాన్ని కలిగి ఉంటాయి. దీనికి ఆ స్వభావం తక్కువ.
అచ్చం చక్కెరను పోలి ఉండే ఎరిథ్రిటాల్ ఆహార పరిశ్రమకు మహా ఇష్టంగా మారింది. డయాబెటిక్స్ కోసం తయారు చేసే రకరకాల ఆహార పదార్థాలు, పానీయాల్లో దీనిని విరివిగా వాడుతున్నారు. స్టెవియా, మాంక్ ప్రూట్ చక్కెర కంటే 200 నుంచి 400 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. అందువల్ల దీన్ని తక్కువ మోతాదులో వాడినా సరే తీపి ఎక్కువగా ఉంటుంది.
ఎరిథ్రిటాల్ కి కార్డియోవాస్క్యూలార్ సమస్యల మధ్య సంబంధం కోసం మేం ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కానీ ఇది అనుకోకుండా తెలిసిన విషయం. ఇది మేం అసలు ఊహించలేదు. అసలు దాని కోసం ఆలోచించలేదని ఈ అధ్యయనం జరిపిన నిపుణులు చెబుతున్నారు. నిజానికి హాజెన్ రక్తంలో తెలియని రసాయనాలను కనుక్కోవడం కోసం ఈ బృందం పరిశోధనలు చేశారు. అలాంటి రసాయనాల వల్ల గుండెజబ్బులు , స్ట్రోక్ సమస్యలకు ఎలా కారణం అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఫలితాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా 2004 నుంచి 2011 మధ్య గుండె జబ్బుల ప్రమాదం కలిగిన 1157 వ్యక్తుల నమూనాలను సేకరించి విశ్లేషించారు. మన శరీరంలో సహజంగానే అతి కొద్ది మొత్తంలో ఎరిథ్రిటాల్ తయారవుతుంది. పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువ మొత్తంలో ఉంటుంది.
Also Read: వీటిని నీటిలో వేసుకుని స్నానం చేశారంటే అదృష్టం మీ వెంటే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.