మీ పాదాల్లో ఈ లక్షణాలు, ప్రాణాంతక వ్యాధులకు సూచనలు - జర భద్రం!
పాదాలను, పాదాల వేళ్లను కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మనం నడవాలన్నా.. నిలబడాలన్నా కాళ్లు ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాగే, కాళ్ల పాదాలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం నిలబడటం సాధ్యమవుతుంది. పైగా ఉదయం మనం నిద్ర నుంచి మేల్కోవడం మొదలు.. తిరిగి రాత్రి పడకపై పవళించేవరకు కాళ్ల పాదాలు ఎంత ఎంతగా శ్రమిస్తుంటాయో మీకు తెలిసిందే. అయితే, పాదాలు కేవలం నడకలో సాయం చేయడానికే కాదు. మన శరీరంలోని అనారోగ్య సమస్యలను సైతం మనకు తెలియజేస్తుంది. కొన్ని లక్షణాలతో మనల్ని అప్రమత్తం చేస్తుంది. అయితే, అవి పాదాలకు చెందిన సమస్యలేమో అని భ్రమపడితే మాత్రం ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పాదాలు ఎలాంటి సమస్యలను తెలియజేస్తాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
కాళ్ల గోళ్లు శరీరంలో పోషకాహార లోపాన్ని తెలియజేస్తాయట. శరీరానికి తగినంత కాల్షియం అందకపోతే.. మన కాళ్ల వేళ్లు చెప్పేస్తాయి. వాటిలో ఎలాంటి మార్పు కలిగినా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. అలాగే, పాదాల వేలి గోళ్ల పెరుగుదల నెమ్మదించడం, పెళుసుగా మారడం వంటివి గమనించినపుడు జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే కొవ్వు పదార్థం. ఆహారపు అలవాట్లు సరిగా లేనపుడు, వ్యాయామం తగినంత లేనపుడు, పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్నపుడు రక్తంలో ఈ కొవ్వు పేరుకుపోతుంది. రక్తంలో ఇది మోతాదుకు మించినపుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పరుస్తుంది. ఈ అడ్డంకుల వల్ల స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇది ఎలాంటి లక్షణాలు కనపరచకుండా శరీరంలో చేరే జబ్బు, ప్రాణం మీదకు వచ్చే వరకు తెలుసుకోలేమని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వివరించింది. శరీరంలో అధికంగా చేరిన కొలెస్ట్రాల్ వల్ల వచ్చే అనారోగ్యాన్ని పెరీఫెరల్ ఏరియల్ డిసీజ్ అంటారు. కొవ్వు నిల్వలు పేరుకుపోయి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి.
రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు రక్త ప్రసరణకు అంతరాయం కలిగి గుండె నుంచి దూరంగా ఉండే పాదాల్లో ఈ లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరిలోనైనా పెరిగిపోవచ్చు. ఎవరూ దీనికి మినహాయింపు కాదు. ఒంట్లో ఈ రకమైన హానికరమైన కొవ్వు చేరడానికి చాలా కారణాలు ఉంటాయి.
- సాచ్యూరేటెడ్ కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం
- తగినంత శారీరక శ్రమ లేకపోవడం
- అధిక బరువు
- మోతాదుకు మించి మద్యం తీసుకోవడం, పొగతాగడం వంటి ఎన్నో కారణాలతో ఇలా రక్తంలో కొవ్వు చేరుతుంది.
పాదాలను గమనిస్తే.. వ్యాధులను గుర్తించవచ్చు
- పిక్కల్లో నొప్పి, కాళ్లలో తిమ్మిరి, పాదాలు, లేదా వేలి కొసల దగ్గర చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపించినపుడు జాగ్రత్త పడడం అవసరం. ఇవన్నీ కూడా పేరీఫెరల్ ఆర్టరీ డిసీస్ లక్షణాలని గుర్తించాలి. పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ లో రక్తనాళాలు కుంచించుకుపోతాయి, పెళుసుగా తయారవుతాయి లేదా మూసుకుపోతాయి. అందువల్ల పాదాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. అంతేకాదు కాళ్ల మీద ఉండే రోమాలు కూడా రాలిపోతాయి. కొత్త రోమాలు రావు. కాళ్లమీద చర్మం కూడా పాలి పోవడం లేదా నల్లగా మారుతుంది. పాదాల మీద అల్సర్లు ఏర్పడవచ్చు, గాయాలు త్వరగా మానిపోవు. సమస్య చాలా తీవ్రంగా ఉన్నపుడు లింబ్ ఇస్కిమియాకి దారితియ్యవచ్చు.
- కాళ్లు పాదాలకు రక్త ప్రసరణ జరిగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు ఏపనిలో లేకపోయినా, విశ్రాంతిగా ఉన్న సమయంలో కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, హై బీపీ, డయాబెటిస్, అధిక బరువు, తగినంత వ్యాయామం లేకపోవడం ఇలా అనేక కారణాలు ఉండవచ్చు. కాబట్టి కాళ్లు, పాదాల్లో వస్తున్న మార్పులను గమనించడం కూడా చాలా అవసరం.