(Source: ECI/ABP News/ABP Majha)
Urine: మీ మూత్రం రంగు మీకున్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పేస్తుంది
మూత్రం రంగును బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.
శరీరానికి అవసరంలేని వ్యర్థాలను, అదనపు నీటిని తొలగించే ప్రక్రియే మూత్ర విసర్జన. ఇది రక్తం నుండి వ్యర్ధాలను ఫిల్టర్ చేసి శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. అంతేకాదు మూత్ర పరీక్ష ద్వారా ఎన్నో వ్యాధులను నిర్ధారించవచ్చు కూడా. అందుకే మన అంతర్గత ఆరోగ్యం గురించి మూత్రం రంగు చెప్పేస్తుందని అంటారు. ఆరోగ్య నిపుణులు తినే ఆహారాలు, తీసుకునే మందులు, అనారోగ్యాలు కూడా మూత్రం రంగును ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఏ రంగు మూత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో తెలుసుకుందాం.
లేత పసుపు
శరీరం ఉత్పత్తి చేసే యూరోబిలిన్ పిగ్మెంట్ కారణంగా మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన అందరికీ మూత్రం లేత పసుపు రంగులోనే వస్తుంది. దీని రంగు మీరు తీసుకునే నీటిని బట్టి కూడా మారుతుంది. డిహైడ్రేషన్‌కు గురైనప్పుడు మూత్రపిండాలు మూత్రం నుండి ఎక్కువ నీటిని గ్రహిస్తాయి. అలాంటప్పుడు మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారుతుంది. అంటే మీ శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుందని అర్థం. అలాంటప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవాలి.
రంగులేని మూత్రం
మూత్రానికి రంగు లేకుండా నీళ్ళల్లా వస్తుందంటే మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని తాగుతున్నారని అర్థం. మీ మూత్రపిండాలు అదనపు నీటిని రంగులేని మూత్రం రూపంలో విసర్జిస్తాయి.
ముదురు పసుపు రంగు
ముదురు పసుపు రంగులో మూత్రం తరచూ వస్తుంటే పచ్చకామెర్లు సమస్య ఉందేమో అని అనుమానించవచ్చు. బి కాంప్లెక్స్ విటమిన్లు, సల్ఫాసలాజైన్ మందులు వాడుతున్న వారు, ఫెనాజో పైరేడిన్ (ఈ మందులను మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి సూచిస్తారు) మందులు తీసుకుంటున్న వారిలో మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది.
ఎరుపు రంగు
కొన్నిసార్లు మూత్రనాళంలో అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు మూత్రంలో రక్తం కలిసి ఎరుపు రంగులో విసర్జన అవుతుంది. ఉదాహరణకు మూత్రపిండాల్లో రాళ్లు లేదా క్యాన్సర్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఇలా ఎరుపు రంగులో మూత్రం విసర్జన అయ్యే అవకాశం ఉంది.
ముదురు గోధుమ రంగు
ఈ రంగులో మూత్ర విసర్జన జరిగితే ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది మూత్రాశయం లేదు మూత్రపిండాల్లో క్యాన్సర్‌కు మొదటి సూచన కావచ్చు. కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా ఇలా గోధుమ రంగు మాత్రానికి కారణంగా చెప్పుకోవచ్చు. డిహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాల మూత్ర క్యాథెటర్ వాడకం ఇవన్నీ కూడా ఈ మూత్రానికి ప్రథమ లక్షణాలుగా భావించవచ్చు.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీరు అధిక ఒత్తిడికి లోనవుతున్నట్టే లెక్క -జాగ్రత్త పడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.