Monkeypox Cases in India: మంకీపాక్స్‌ను ఎలా కంట్రోల్ చేద్దాం? భారత్‌లో వైరస్ వ్యాప్తిపై ఉన్నత స్థాయి భేటీ
Monkeypox Cases in India: భారత్‌లో మంకీపాక్స్ కేసులు నమోదవటంపై కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించింది.
Monkeypox Cases in India:
భయపడొద్దు, అంతా అదుపులోనే ఉంది
భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు నమోదవటం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. దిల్లీలో తొలి కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్-DGHS ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. దిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకింది. భారత్‌లో ఇది నాలుగో కేసు కావటం కలవర పెడుతోంది. అయితే...ఈ బాధితుడి ట్రావెల్ హిస్టరీని పరిశీలించిన అధికారులు, అతడు విదేశాలకు వెళ్లిన దాఖలాలేవీ లేనట్టు తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి బాధితుడికి లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యక్తి సాంపిల్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఐసోలేషన్‌లో ఉన్న బాధితుడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. "మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రజలెవరూ భయాందోళనలకు లోనుకావద్దు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం. వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు" అని ట్వీట్ చేశారు.
The first case of Monkeypox was detected in Delhi. The patient is stable and recovering.
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 24, 2022
There's no need to panic. The situation is under control.
We have made a separate isolation ward at LNJP. Our best team is on the case to prevent the spread and protect Delhiites.
కేరళలోనే మూడు కేసులు
"ఎక్కడి నుంచి ఇది వ్యాప్తి చెందింది, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా నిర్వహించాలి" అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దిల్లీకి ముందు కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించగా, వైద్యులు టెస్ట్ చేశారు. రిపోర్ట్‌లో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. కన్నూర్ జిల్లాలోనూ ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. జులై 14వ తేదీన కేరళలో తొలి కేసు వెలుగులోకి వచ్చింది. తీవ్ర జ్వరం, దగ్గు ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్న వ్యక్తిని పరీక్షించగా మంకీపాక్స్‌గా నిర్ధరణ అయింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తమైంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కేసులు నమోదవుతున్న ఆయా దేశాలకు పలు సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
Also Read: WHO Declares Health Emergency : కొవిడ్ సోకిన వ్యక్తిలో Monkeypox వైరస్ గుర్తింపు | ABP Desam