ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
కేవలం అధిక బరువుతో ఉన్న వారిలోనే కొలెస్ట్రాల్ ఉంటుందని అనుకుంటాం, కానీ సన్నగా ఉండే వారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది. అందుకే రోజుకో గ్లాసు ఆమ్లా అర్జున జ్యూస్ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ జ్యూస్‌ను ఇంట్లోనే ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో బాటిల్‌స లో ప్యాక్ చేసి రెడీమేడ్ గా దొరుకుతున్నప్పటికీ ఇంట్లోనే చేసుకొని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఈ జ్యూస్ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఉసిరి కాయ, అర్జున చెట్టు బెరడుతో దీన్ని తయారుచేస్తారు.
గుండె ఆరోగ్యం
ఈ జ్యూస్ వల్ల గుండెకు ఎంతో మంచిది. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ రోజూ తాగాలి. ఇందులో ఉండే పోషకాలు, గుండె కండరాలను బలపరుస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
రోగ నిరోధక శక్తి
ఈ జ్యూస్‌లో ప్రధాన పదార్థం ఉసిరి. ఉసిరికాయలో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఉసిరికాయలో 600 నుంచి 700mg విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, వైరస్‌లు, బ్యాక్టీరియాల దాడి నుంచి శరీరాన్ని కాపాడతాయి.
అందానికి...
చర్మం మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారికి ఈ జ్యూస్ తక్కువ కాలంలోనే మెరిసే చర్మాన్ని ఇస్తుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరచి మెరుపును అందిస్తుంది.
జీర్ణ క్రియకు...
అజీర్ణం, ఎసిడిటీ, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి -అర్జున రసాన్ని తాగడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంట్లో ఒకసారి తయారు చేసుకుంటే బాటిల్‌లో వేసి నిల్వ ఉంచుకోవచ్చు.
దీన్ని ఎలా తయారు చేయాలి?
ఉసిరికాయలు - ఒక కప్పు
అర్జున బెరడు - చిన్న ముక్క
తేనె - ఒక స్పూను
నీళ్లు - రెండు కప్పులు
తయారీ ఇలా
ఉసిరికాయను బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జు నుంచి ఉసిరి రసాన్ని తీయాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే అర్జున చెట్టు బెరడు ముక్కను కూడా వేసి మరిగించాలి. కాస్త చల్లారాక వడకట్టుకొని ఒక బాటిల్‌లో ఆ నీటిని పోయాలి. ఆ బాటిల్ నీటిలో ముందుగా తీసుకున్న ఉసిరి రసాన్ని కలుపుకోవాలి. తాగే ముందు తేనెను కలిపి తాగితే ఎంతో మంచిది.
Also read: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.