(Source: ECI/ABP News/ABP Majha)
Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త
శరీరంలో ప్రతి కణానికి రక్త సరఫరా కావడం చాలా ముఖ్యం. అలా కాకపోతే అనారోగ్యాలు రావడం ఖాయం.
శరీరంలో రక్తం పాత్ర చాలా ప్రధానమైనది. శరీరంలోని ప్రతి కణానికి, ఆక్సిజన్‌ను, పోషకాలనూ తీసుకుని వెళ్ళేది రక్తమే. అందుకే శరీరం అంతా సవ్యంగా రక్తప్రసరణ కచ్చితంగా జరగాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్త సరఫరా సరిగా జరగకపోతే శరీర విధులకు ఆటంకం కలుగుతుంది. అయితే శరీరంలో ప్రతి కణానికి రక్త సరఫరా జరగకపోతే కొన్ని రకాల లక్షణాల ద్వారా ఆ విషయాన్ని మెదడు మనకు తెలియజేస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. వైద్యులను కలిసి తగిన మందులు వాడడం మంచిది.
ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. తరచూ జ్వరం వచ్చి పోతూ ఉంటుంది.
2. శరీరం హఠాత్తుగా చల్లబడుతుంది. కాసేపటికే సాధారణ స్థాయికి వచ్చేస్తుంది.
3. ఎక్కువగా చలివేస్తుంది.
4. పాదాలు, చేతుల్లో నీరు చేరవచ్చు. దీన్నే ఎడిమా అని పిలుస్తారు. కిడ్నీలకు రక్త సరఫరా సరిగా జరగనప్పుడు ఇలా ఎడిమా వచ్చే అవకాశం ఉంది.
5. తీవ్రంగా అలసట అనిపిస్తుంది. ఎంత తింటున్నా అలసట మాత్రం తీరదు.
6. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
7. శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది.
8. జీర్ణ సమస్యలు వస్తాయి అంటే ఆహారం సరిగా జీర్ణం కాదు. మలబద్ధకం కూడా వస్తుంది.
9. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
10. చిన్న చిన్న విషయాలే మర్చిపోతూ ఉంటారు. దేనిపైనా ఏకాగ్రత ఉండదు.
11. రోగనిరోధక శక్తి తగ్గి, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు.
12. ఆకలి తగ్గిపోతుంది.
13. గోళ్లు, జుట్టు పెరుగుదల ఉండదు.
పైన చెప్పిన లక్షణాలన్నీ శరీరంలో రక్త సరఫరా సరిగా జరగనప్పుడు కనిపించేవే. చర్మం రంగులో మార్పులు కనిపిస్తున్నా, కంటిలో రక్తనాళాల రంగు మారినా కూడా రక్త సరఫరా సరిగా లేదని అర్థం. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఓసారి వైద్యుల్ని సంప్రదించాలి. ఆలస్యం అయితే తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. శరీరంలో తగినంత రక్తం లేకున్నా కూడా ఇలా రక్త సరఫరాకు ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి రక్త ఉత్పత్తికి సహకరించే ఆహారాలను తినాలి.
ఏం చేయాలి?
దానిమ్మ పండ్లను రోజూ తినడం వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు రక్త సరఫరా బాగుంటుంది. బీట్‌రూట్, టమోటోలు కూడా రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. ఇక విటమిన్ సి పుష్కలంగా ఉండే బత్తాయి, ఆరెంజ్, నిమ్మకాయి వంటి పండ్ల జ్యూసులు తాగడం వల్ల రక్తం సమృద్ధిగా ఏర్పడి సరఫరా కూడా బాగుంటుంది. వాల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడుకి రక్త సరఫరా మెరుగుపడుతుంది. చెర్రీ పండ్లు, తాజా ఆకుకూరలు తినడం వల్ల గుండెకు రక్తసరఫరా చక్కగా జరిగి బీపీ కూడా అదుపులో ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈరోజు నుంచే రక్త ఉత్పత్తికి సహకరించే ఆహారాలను తినడం మొదలుపెట్టాలి. లేకుంటే అనేక అనారోగ్యాలు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి.
Also read: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.