New study: పీరియడ్స్ సక్రమంగా రాకపోతే మహిళల్లో ఆ ప్రాణాంతక వ్యాధులు కలిగే అవకాశం , చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం
మహిళల పీరియడ్స్ సమస్యలపై హార్వర్డ్ , యాపిల్ సంస్థ కలిపి ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. అందులో షాకింగ్ విషయం బయటపడింది.
మహిళల ఆరోగ్యంలో పీరియడ్స్‌ది ప్రముఖ పాత్ర. నెలనెలా జరగాల్సిన ప్రక్రియ సక్రమంగా జరగకపోతే, రుతుస్రావం అవ్వాల్సిన తీరులో అవ్వకపోతే... అది ఆరోగ్యసమస్యలను సూచిస్తుంది. కానీ చాలా మంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటారు. రెండు మూడు నెలలకోసారి రుతుస్రావం జరుగుతుంటే దాన్ని ఒక సమస్యగా గుర్తించారు. థైరాయిడ్ సమస్య వల్ల లేక గర్భాశయంలో సిస్టుల వల్లో రావట్లేదులే అనుకుంటారు కానీ అంతకుమించి పట్టించుకోరు. ఈ అంశంపై హార్వర్డ్-యాపిల్ కలిసి ఉమెన్స్ హెల్త్ స్టడీ పేరుతో అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇందులో మహిళల నెలసరి ఆరోగ్యంపై పరిశోధన చేశాయి. అందులో దిమ్మతిరిగే ఫలితం బయటపడింది.
టెక్ దిగ్గజం యాపిల్‌తో కలిసి హార్వర్డ్ యూనివర్సిటీలో జరిపిన కొత్త అధ్యయనం ప్రకారం సక్రమంగా రాని పీరియడ్స్, పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)సమస్యలతో బాధపడుతున్న మహిళలు భవిష్యత్తులో గుండె వ్యాధుల బారిన త్వరగా పడతారు. ఈ పరిశోధనా బృందానికి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ శ్రుతి మహాలింగయ్య అనే ప్రవాస భారతీయురాలు నాయకత్వం వహిస్తున్నారు. పీసీఓఎస్ సమస్య చాలా మంది మహిళల్లో సమస్యలకు కారణం అవుతోంది.
షాకింగ్ విషయం...
ఇంతవరకు పీసీఓడీ, సక్రమంగా లేని రుతుక్రమాలు మహిళల గర్భధారణపైనే ప్రభావం చూపిస్తాయని అనుకున్నారంతా. కానీ ఈ పరిస్థితులు గుండె, రక్త ప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుందని ఈ కొత్త అధ్యయనం వల్ల తేలింది. దాదాపు 37,000 మంది మహిళలకు సబంధించిన రుతుక్రమ డేటాను పరిశీలించి ఈ ఫలితాన్ని తేల్చారు.
పీసీఓఎస్ సమస్య లేని మహిళలతో పోలిస్తే ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ. మధుమేహం, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు గుండెను దెబ్బతీస్తాయి. పీసీఒఎస్ లేనివారి కన్నా పీసీఓఎస్ ఉన్న వారిలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం 1.7 రెట్లు ఉన్నట్టు తేల్చారు.
కాబట్టి పీరియడ్స్ క్రమం తప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.