Covaxin : కోవాగ్జిన్ కొనకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం ! ఎందుకంటే ?
భారత్ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చింది. తన ఏజెన్సీలకు భారత్ బయోటెక్ తయారు చేసే కోవాగ్జిన్ సరఫరా రద్దు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గినందున తమ టీకా కోవాగ్జిన్ ( Covaxin ) ఉత్పత్తి తగ్గించుకుంటున్నామని భారత్ బయోటెక్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) షాక్ ఇచ్చింది. తన ఏజెన్సీలకు భారత్ బయోటెక్ తయారు చేసే కోవాగ్జిన్ సరఫరా రద్దు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ధ్రువీకరించింది. ఈ ఏడాది మార్చి 14 నుంచి 22 తేదీల్లో నిర్వహించిన అత్యవసర వినియోగ అనుమతి (ఇయుఎల్), గుడ్ మానిఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జిఎంపి) తనిఖీల్లో సంతృప్తికర ఫలితాలు రాకపోవడంతో సరఫరా రద్దు చేయాలని నిర్ణయించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతుల కోసం కోవాగ్జిన్ ఉత్పత్తిని నిలిపివేయడానికి భారత్ బయోటెక్ కట్టుబడి ఉందని కూడా డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటనపై భారత్ బయోటెక్ ( Bharat Biotech ) అధికారులు కూడా స్పందించారు. ఈ నెల 1న చేసిన ప్రకటనలో ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ బృందం తనిఖీల్లో వెలుగుచూసిన లోపాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది. ప్రత్యేకించి కోవాగ్జిన కోసమే తాము ప్రత్యేకంగా ఉత్పత్తి కేంద్రాలను సిద్ధం చేయలేదని.. తాము మాత్రమే కాదు ప్రపంచంలోని ఏ సంస్థ కూడా అలా చేయలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ప్రత్యేకంగా కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ( Corona Vaccine ) అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తి కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలంటే 24 నెలల వరకూ పడుతుందన్నారు. ఇతర వ్యాక్సిన్ల ( Vaccine Production ) ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్లోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరిపి .. వ్యాక్సిన్ సిద్ధం చేశారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కేవలం కరోనా కోసం సిద్ధం చేసిన ఉత్పత్తి కేంద్రాల్లో మాత్రమే ఉత్పత్తి చేయాలనే నిబంధన పెట్టింది.ఈ ప్రమాణాన్ని భారత్ బయోటెక్ అందుకోలేకపోయింది.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టిన నిబంధన వల్ల తమకు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. పూర్తిగా వంద శాతం భారతీయ టీకా ( Indian Vaccine ) అయిన కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా లేటుగా అత్యవసర వినియోగానికి చాన్సిచ్చింది. ఇప్పుుడు రకరకాల కారణాలు చూపుతూ.. తన ఏజెన్సీలకు కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వారి అనుబంధ సంస్థలు.. దేశాలు ఈ వ్యాక్సిన్లను కొనుగోలు చేయవు.