(Source: ECI/ABP News/ABP Majha)
AIMS chief: కరోనా కొత్తవేరియంట్ల కట్టడికి బూస్టర్ డోస్ తప్పదు- ఎయిమ్స్ చీఫ్
కరోనాలో కొత్త వేరియంట్లను ఎదుర్కోగలమా? రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లంతా సేఫ్ అని అనుకోగలమా? థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న సమయంలో చిన్న పిల్లల సంగతేంటి? ఎయిమ్స్ డైరెక్టర్ ఏం చెబుతున్నారు?
రెండేళ్లుగా దేశ ప్రజల్నిపట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టేలా లేదు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం…ధైర్యంగా ఎదుర్కోవడం మినహా ఇప్పటి వరకూ దీనికి సరైన మందు లేదు. వ్యాక్సిన్లు రావడంతో ప్రజల్లో ధైర్యం వచ్చింది. వ్యాక్సిన్లు వచ్చిన మొదట్లో వేసుకునేందుకు భయపడినప్పటికీ…రాను రాను అవగహాన పెరగడంతో ఆ తర్వాత వ్యాక్సిన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఓ దశలో వ్యాక్సిన్ కొరత కూడా వెంటాడింది. అదే సమయంలో వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచుతూ వచ్చిన వార్తలపై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్ కొరతని కప్పిపుచ్చుకునేందుకే గ్యాప్ పెంచారన్నారు. వీటన్నంటికీ క్లారిటీ ఇస్తూ…ఏ వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ ఎక్కువ వృద్ధి చెందుతాయి…ఎందుకు అంత గ్యాప్ అవసరమో క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఇదంతా సరే…లేటెస్ట్ విషయం ఏంటంటే ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారు...బూస్టర్ డోస్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.
కరోనా వైరస్ లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉండడంతో వాటిని కట్టడి చేసేందుకు బూస్టర్ డోసులు అవసరం పడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కరోనా కారణంగా దేశంలోని చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతూ వస్తుందని, కొత్త వేరియంట్లు ఎటాక్ చేస్తే తట్టుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. కొత్తవేరియంట్లను తట్టుకునేందుకు బూస్టర్ డోసులు అవసరం పడతాయని తెలిపారు.
ఇప్పటికే కరోనాబారిన పడి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి…. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కూడా యాంటీబాడీస్ బాగానే పెరుగుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. పైగా వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకే అవకాశం తక్కువ….ఒకవేళ కరోనా బారిన పడినా హోం ఐసోలేషన్లో ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రానేరాదని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. అయినప్పటికీ మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం సహా కరోనా నిబంధనలను గాలికొదిలేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బూస్టర్ డోసుల విషయానికొస్తే ఈ ఏడాది చివరి నాటికి బస్టర్ డోసులు రాబోతున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. బూస్టర్ డోస్ వ్యాధినిరోధక శక్తిని పెంచి అన్ని రకాల వేరియంట్లను సమర్థవంతంగా ఎదురుకునేందుకు సహకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే బస్టర్ డోసులు పంపిణి ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఇక చిన్నారుల వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానుందని, దానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని సెప్టెంబర్ నాటికి వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గులేరియా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో చిన్నారులపై ప్రయోగాలు జరుగతున్నాయన్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ప్రయోగాలు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. మరో సంస్థ జైడెస్ క్యాడిలా ఇటీవల అత్యవసర అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో చిన్నారులపై ప్రయోగాల వివరాలను కూడా అందించిందని చెప్పారు. సెప్టెంబరు చివరి వారం నాటికి చిన్నారుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దశలవారీగా పాఠశాలలు తెరిచేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.