NTR On Alia Love: కారులో ఆలియా భట్ ఏం చేసిందో ఎన్టీఆర్ చెప్పబోతే...
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి ప్రేమ కహాని గురించి ఎన్టీఆర్ చెప్పబోతే ఆలియా భట్ ఏం చేశారో తెలుసా?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆవిడ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉంది. ముంబైలో ఉన్నప్పుడు వేర్వేరు షూటింగులు చేసినా... ఏదో ఒక సమయంలో కలిసి కబుర్లు చెప్పుకోనే అవకాశం ఉంటుంది. ముంబై కాకుండా వేరే సిటీకి షూటింగ్ కోసమని వెళితే... ఫోనులు, వీడియో కాల్స్ చేసుకుంటారు కదా! 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణకు వచ్చినప్పుడు ఆ విధంగా చేశారట. ఆమె ప్రేమ కథ గురించి ఎన్టీఆర్ చెప్పబోతే... ఆలియా భట్ అతడి నోటికి అడ్డు చెప్పారు. చెప్పవద్దని అంటూ చేత్తో ఎన్టీఆర్ మూతిని మూసేశారు.
సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పుడు... ఓ నెల ముందు డిసెంబర్‌లో ముంబైలో ఒక ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ స్పెషల్ కింద డిసెంబర్ 31న ఈవెంట్ టెలికాస్ట్ చేశారు. అయితే... శాటిలైట్ లిమిటేషన్స్ (టీవీ స్లాట్) వల్ల పూర్తి ఈవెంట్ టెలికాస్ట్ చేయాలని, కొత్తగా మళ్ళీ వీడియోస్ విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాకు కరణ్ జోహార్ కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో సెట్స్ లో ఎక్కువసేపు ఎవరు ఫోన్ మాట్లాడతారని అడిగారు.
ఎక్కువసేపు ఫోన్ మాట్లాడేది ఎవరన్న ప్రశ్నకు ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరూ ఆలియా భట్ వైపు చూశారు. ఆమె గురించి చెప్పారు. ''లాంగ్ డిస్టెన్స్ రిలేషన్'' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ఎన్టీఆర్. ''బహుశా మరో 'ఆర్' (రణ్‌బీర్ కపూర్) తో మాట్లాడుతున్నారేమో!'' అని రామ్ చరణ్ అన్నారు. ఎన్టీఆర్ అయితే "ఏం జరిగిందో తెలియదు కానీ వీడియో కాల్స్ కూడా చేసేది. ఒకసారి క్రేజీ వీడియో కాల్ మాట్లాడింది. కారులో కూర్చుని..." అని ఎన్టీఆర్ చెప్పబోతే, అతడిని ఆలియా భట్ ఆపేశారు. అదీ సంగతి! మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానున్న సంగతి తెలిసిందే.
'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆలియా భట్ నటించారు కానీ జంటగా కాదు. రామ్ చరణ్ జోడీగా, సీత పాత్రలో ఆలియా భట్ కనిపించనున్నారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ చేయనున్న సినిమాలో ఆమె నటించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఎన్టీఆర్ 30లో ఆలియా నటించడం దాదాపు ఖాయమే. ముంబైలో జరిగిన 'గంగూబాయి కతియావాడి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ సినిమా గురించి ఆలియాను ప్రశ్నించగా... "ఎన్టీఆర్ 30 కోసం నన్ను సంప్రదించారు. నేను కొరటాల శివ గారితో మాట్లాడుతున్నాను. ఆయన ఇప్పటి వరకూ చాలా మంచి సినిమాలు తీశారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 గురించి నేను ఏమీ కామెంట్ చేయదలచుకోలేదు. అయితే... మా కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను. నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను" అని చెప్పిన సంగతి తెలిసిందే.