AP Govt & Pawan Kalyan: 'భీమ్లా నాయక్' విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుంది?
విడుదల తేదీ విషయంలో 'భీమ్లా నాయక్' చిత్రబృందం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందా? రాజకీయ వివాదాలకు దూరంగా వ్యవహరిస్తోందా? ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుంది?
రాజకీయపరమైన కారణాలతో 'వకీల్ సాబ్' విడుదల సమయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కటువుగా వ్యవహరించిందని టాలీవుడ్ టాక్. బెనిఫిట్ షోలు, ప్రీమియర్లకు అనుమతులు ఇవ్వలేదనేది నిజమే. ఆ తర్వాత టికెట్ రేట్స్ విషయంలో నాని మాట్లాడినందుకు 'శ్యామ్ సింగ రాయ్' విడుదల సమయంలో థియేటర్లు తనిఖీలు చేయడం వంటి చర్యలతో ఏపీలో అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించారని ట్రేడ్ పండితుల టాక్. అధికారుల ఆకస్మిక తనిఖీల వెనుక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందని గుసగుస. టికెట్ రేట్స్ విషయంలో మాట్లాడడానికి నాగార్జున నిరాకరించిన కారణంగా 'బంగార్రాజు' విడుదల కోసం నైట్ కర్ఫ్యూను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం రూట్ క్లియర్ చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. అదంతా గతం! ఇప్పుడు వర్తమానానికి వస్తే...
రాబోయే రెండు మూడు నెలలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరీ మరీ ముఖ్యమైన రోజులు. 'రాధే శ్యామ్', 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య', 'సర్కారు వారి పాట' వంటి భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అన్నీ వందల కోట్ల బడ్జెట్‌తో తీసినవే. ప్రస్తుతం ఏపీలో అమలులో ఉన్న థియేట్రికల్ టికెట్ రేట్స్ ప్రకారం విడుదల చేస్తే... లాభాల సంగతి అటుంచితే వసూళ్లు రావడం కూడా కష్టమే. ఫిబ్రవరి నెలాఖరున టికెట్ రేట్స్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని టాలీవుడ్ నిర్మాతలు ఆశిస్తున్నారు. ఆ మధ్య ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలిశారు. త్వరలో పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'బంగార్రాజు' బ్లాక్ బస్టర్ మీట్‌లో నాగార్జున కూడా అదే మాట చెప్పారు.
టికెట్ రేట్స్ పెంచితే... 'భీమ్లా నాయక్' విడుదలకు ముందు పెంచుతారా? తర్వాత పెంచుతారా? ఈ సందేహం మొన్నటివరకూ నెలకొంది. ఎందుకంటే... జగన్ - పవన్ మధ్య రాజకీయ పరంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. ఆ సందేహాలకు చెక్ పెడుతూ... 'భీమ్లా నాయక్' బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనేది ఇండస్ట్రీ టాక్. పైకి ఫిబ్రవరి 25, ఏప్రిల్ 1 అంటూ రెండు విడుదల తేదీలు ప్రకటించినా... ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం సన్నాహాలు చేస్తున్నారట.
మార్చి 11న 'రాధే శ్యామ్', మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదలైతే... ఆ రెండు సినిమాలకూ బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే? టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్స్ వస్తే? ఆ తర్వాత వస్తున్న 'భీమ్లా నాయక్'కు కూడా బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే, ఆ తర్వాత రానున్న 'ఎఫ్ 3', 'ఆచార్య'. 'సర్కారు వారి పాట'కు కూడా! నాలుగు సినిమాల మధ్యలో ఒక్క సినిమాకు వేరే నిబంధనలు తీసుకు రావడం కుదరదు. ఒకవేళ తీసుకువస్తే ఏపీ ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దాంతో 'భీమ్లా నాయక్' విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందనేది ట్రేడ్ వర్గాల్లో చర్చకు కారణం అయ్యింది.
బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ పెంపు ఉంటే వసూళ్లు ఎక్కువ ఉంటాయి. లేదంటే తక్కువ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్మాత దగ్గర నుంచి ఏరియాల వారీగా సినిమా విడుదల హక్కులను డిస్ట్రిబ్యూటర్లు కొంటారు. సినిమాల్లోకి రాజకీయ జోక్యంతో డిస్ట్రిబ్యూటర్లు ఇన్ని ఆలోచించాల్సి వస్తోంది. అదీ సంగతి!