Vijay Deverakonda Shoulder Injury : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత
విజయ్ దేవరకొండకు 'లైగర్' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ రిజల్ట్ పక్కన పెడితే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కారణంగా ఆయనకు కొన్ని గాయాలు అయ్యాయి.
'లైగర్' బాక్సాఫీస్ రిజల్ట్ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. తెలుగు, హిందీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఆ సినిమా ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా ఫైనాన్షియర్ శోభన్, తెలుగులో థియేట్రికల్ రైట్స్ కొన్న వరంగల్ శ్రీనుకు, దర్శకుడు పూరి జగన్నాథ్‌కు మధ్య గొడవలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే... బాక్సాఫీస్ పరంగా విజయ్ దేవరకొండకు నిరాశ మిగిల్చిన ఈ సినిమా, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఆ ఫైట్స్ కారణంగా గాయాలు అయ్యాయి.
'లైగర్' గాయాలు...
ఎనిమిది నెలల తర్వాత!
'లైగర్'లో విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్, ఎంఎంఏ ఛాంపియన్ కావాలనుకునే వ్యక్తిగా కనిపించారు. రింగులో ఫైటింగ్స్ రియల్‌గా ఉండటం కోసం ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. కొన్ని రోజులు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆ సమయంలో ఆయన భుజానికి గాయం అయ్యింది. ఎనిమిది నెలల తర్వాత ఆ గాయం తగ్గింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ చెప్పారు.
''ఎనిమిది నెలల చికిత్స తర్వాత గాయం తగ్గింది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా? అని ఎదురు చూస్తున్నాను. చాలా రోజుల నుంచి ఇంటికి మాత్రమే పరిమితం అయ్యాను. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. పని చేయాలి'' అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. జిమ్‌లో వర్కవుట్స్ ఎక్కువ చేయడం, వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల చేతి వేళ్ళకు అయిన గాయాలను ఆయన చూపించారు.
సినిమాల్లోకి రావడానికి ముందు కూడా విజయ్ దేవరకొండకు షోల్డర్ ఇంజ్యూరీ అయినట్టు ఆయన ట్రైనర్ కులదీప్ సేథీ తెలిపారు. 'లైగర్' షూటింగ్ చేస్తున్న సమయంలో మరోసారి ఆ గాయం తిరగబెట్టిందట. దాంతో విజయ్ దేవరకొండ చాలా కష్టపడాల్సి వచ్చిందని సమాచారం. అయితే... తన పోస్టులో విజయ్ దేవరకొండ ఎక్కడా 'లైగర్' పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చేస్తున్నారు. అందులో సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కశ్మీర్ వెళ్లి కొంత షూటింగ్ చేసి వచ్చారు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం బాలేకపోవడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేశారు. హైదరాబాద్ షెడ్యూల్స్ లేట్ అవుతున్నాయని తెలిసింది.
Also Read : సమంత గ్లిజరిన్ వాడలేదు - జ్వరంలోనూ స్టంట్స్!
'ఖుషి' తర్వాత విజయ్ దేవరకొండ మరో సినిమా కమిట్ కాలేదు. 'లైగర్' డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన 'జన గణ మణ' సినిమాను పక్కన పెట్టేశారు. దాంతో ఆయనతో సినిమా చేయడం కోసం యువ దర్శకులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, ఆల్రెడీ విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తీసిన పరశురామ్ కథలు చెప్పే ప్రయత్నాల్లో ఉన్నట్టు వినికిడి. హరీష్ శంకర్ పేరు కూడా వినబడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన 'భవదీయుడు భగత్ సింగ్' ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. అందుకని, విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని ట్రై చేస్తున్నారట.