Kushi Movie: టర్కీలో 'ఖుషి' షూటింగ్ - విజయ్ దేవరకొండ, సమంత ఫోటోలు నెట్టింట్లో వైరల్!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్ టర్కీలో శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడి చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
టర్కీలో శరవేగంగా 'ఖుషి' సినిమా షూటింగ్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో కొనసాగుతోంది. ఈ చిత్రంలోకి కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాటలను కూడా షూట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో పాటు సమంత షూటింగ్ లో పాల్గొంటున్నారు. టర్కీలో తమ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను విజయ్, సామ్ నెటిజన్లతో పంచుకున్నారు. విజయ్ అక్కడి చారిత్రక కట్టడాల దగ్గర నిల్చొని ఫోటోలకు పోజులిచ్చాడు. అక్కడి ఫుడ్ టేస్ట్ చేస్తూ కనిపించాడు. సమంత పచ్చటి గడ్డి మీద పడుకుని కూల్ గా రిలాక్స్ అవుతూ కనిపించింది. అటు వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా అక్కడ షూట్ చేస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించింది. ఇద్దరు స్టార్స్ అక్కడి వంతెనపై డ్యాన్స్ చేస్తూ కనిపించారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఒక ఆర్మీ ఆఫీసర్, కాశ్మీరీ మహిళకు సంబంధించిన కథతో రూపొందుతున్నట్లు సమాచారం.
సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్, సామ్, శివ
View this post on Instagram
View this post on Instagram
ఇక సమంత, విజయ్ దేవరకొండ చివరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. 'మహానటి' తర్వాత సమంత -విజయ్ దేవరకొండ కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. ‘లైగర్’ చిత్రంతో ఫ్లాప్ అందుకున్న విజయ్‌కు.. ‘టక్ జగదీష్’తో నిరాశ పరిచిన డైరక్టర్ శివ నిర్వాణకూ ఈ సినిమా విజయం కీలకంగా మారింది. ఇప్పుడు 'శాకుంతలం' ప్రభావంతో సామ్ కూడా ‘ఫ్లాప్’ల జాబితాలోకి చేరింది. దీంతో ఆమెకు కూడా అర్జెంట్ గా ఒక హిట్ అవసరం. నిజానికి 'ఖుషీ' చిత్రాన్ని గతేడాది క్రిష్మస్ సందర్భంగా డిసెంబర్ 23న నాలుగు దక్షిణాది భాషల్లో ఈ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, సమంత అనారోగ్య బారిన పడటంతో ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి.
ప్రస్తుతం ‘ఖుషీ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయ్ దేరవకొండ, సమంత, శివ నిర్వాణలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Read Also: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా