Suresh Babu: నిర్మాత సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం, మిగతా వారి పరిస్థితి ఊహించడం కష్టమే !
వైజాగ్ లోని ఐకానిక్ జ్యోతి థియేటర్ ను నిర్మాత సురేష్ బాబు అమ్మేసినట్లు తెలుస్తున్నది. గత కొంత కాలంగా ప్రేక్షకులు థియేటర్లకు ఎక్కువగా రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించారు దగ్గుబాటి సురేష్ బాబు. తన తండ్రి, దివంగత మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గానూ సేవలు అందిస్తున్నారు. పలు సినిమా థియేటర్లను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రావడం లేదు. ఈ విషయంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పట్నంలో గొప్ప పేరున్న థియేటర్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ తరహాలోనే వైజాగ్ లో జ్యోతి థియేర్ చాలా ఫేమస్. అలాంటి ప్రముఖ థియేటర్ ను సురేష్ బాబు వదులుకున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
కొత్త సినిమా రిలీజ్ అయితే సందడే సందడి
కొంత కాలం కిందటి వరకు కొత్త సినిమాలు రిలీజ్ అయితే సినిమా థియేటర్ల దగ్గర ఓ రేంజ్‌లో సందడి నెలకొనేది. ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండేది కాదు. తమ అభిమాన హీరోలకు నిలువెత్తు కటౌట్లు పెట్టేవారు. వందల కొద్ది ఫెక్సీలు కట్టేవాళ్లు. పాలాభిషేకాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు. సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా, అభిమానులు మాత్రం తమ హీరోలకు బ్రహ్మరథం పట్టేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. కరోనా తరువాత గతంలో మాదిరిగా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు రావడం లేదు. సూపర్ హిట్ సినిమా అని టాక్ వస్తే తప్ప థియేటర్ల రావడం తగ్గించేశారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే థియేటర్ల దగ్గర సందడి నెలకొంటున్నది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులకు ఓటీటీలు ప్రత్యామ్నాయాలుగా మారిపోతున్నాయి.
ఓటీటీలతో థియేటర్లకు ఎసరు.. పలు థియేటర్లు మూత
ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్ల పరిస్థితి దెబ్బతింటోంది. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది కలిసి ఇంట్లోనే లేటెస్ట్ సినిమాలు చూస్తున్నారు ప్రజలు. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా.. నెల లేక రెండు రోజుల్లోనే ఓటీటీల్లో విడుదల అవుతుంది. ఎంచక్కా ఇంటి దగ్గరే కూర్చుని.. నచ్చిన సమయంలో సినిమాలు చూసే వీలుండటంతో థియేటర్ల వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఓటీటీల పుణ్యమా అని ఇప్పటికే పలు సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఉన్న సినిమా హాళ్లు సైతం లాభాలు రాక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి సురేష్ సైతం వైజాగ్ లోని థియేటర్ ను వదులుకున్నట్లు తెలుస్తున్నది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు తన థియేటర్లను అమ్ముతున్నారంటే.. మిగతా వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలంగాణతో పాటు ఏపీలోనూ ప్రస్తుతం సినిమా థియేటర్లను నడపటం భారంగానే ఉందంటున్నారు యజమానులు. రానున్న రోజులు చాలా సినిమా థియేటర్లు మూతపడే అవకాశం కనిపిస్తున్నది.
జ్యోతి థియేటర్ స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్
సురేష్ బాబు నుంచి జ్యోతి థియేటర్ ను విజయనగరానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారట. వారు ఈ థియేటర్ ను కూల్చేసి అక్కడ అదే స్థలంలో 10 అంతస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నారని సమాచారం. కొన్ని నెలల కిందట తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చిన్న థియేటర్లతో పాటు చరిత్ర ఉన్న సినిమా హాల్స్ సైతం మూసివేశారు.