పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?
హీరోయిజం పేరుతో ఏం చూపించినా సరే అభిమానులు, ప్రేక్షకులు చూసేస్తారని దర్శకులకు భావిస్తున్నారా? పుచ్చకాయల్ని కోసినట్టు పీకలు కోయించడం ఏమిటో అర్థం కావడం లేదు.
హీరోయిజం పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద ఏం చూపించినా సరే ప్రేక్షకులు, హీరోల అభిమానులు చూసేస్తారని దర్శకులు భావిస్తున్నారా? వయలెన్స్ ఎంత ఎక్కువ అయితే హీరోలు అంతటి వీరులు, శూరులు అని ఆడియన్స్ ఆడిటోరియం అంతా దద్దరిల్లేలా గోల గోల చేస్తారని భ్రమల్లో ఉన్నారా? లేకపోతే పుచ్చకాయల్ని కోసినట్లు పీకలు కోయించడం ఏమిటి? సంక్రాంతి సందర్భంగా విడుదల తెలుగు సినిమాలు ఓ విషయంలో మాత్రం ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి.
తలలు తెగి పడటం ఏమిటో?
సంక్రాంతి బరిలో ముందుగా విడుదలైన తెలుగు సినిమా 'వీర సింహా రెడ్డి'. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఫ్యాక్షన్ & యాక్షన్ అంటే వేట కత్తులు, కొడవళ్ళు, వాటితో పోరాటాలు కామన్ కదా! పైగా, హీరోది లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్. ఇక చెప్పేది ఏముంది? హింస ఏరులై పారింది. 'కోసే వాడికి కోడి మీద పగ ఉండదు. నేనూ అంతే! చాలా పద్ధతిగా నరుకుతా' అంటూ గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ చేత డైలాగ్ చెప్పించారు. ప్రత్యర్థులపై అసలు ఏమాత్రం కనికరం చూపని కథానాయకుడిగా కత్తులతో వేటాడటం వంటి సన్నివేశాలను సాధారణం అన్నట్టు చూపించారు.
'వీర సింహా రెడ్డి'లో ఫైట్స్ అన్నీ ఒక ఎత్తు! పతాక సన్నివేశంలో యంగ్ బాలకృష్ణ చేత విలన్ దునియా విజయ్ తల నరికించడం మరో ఎత్తు. కథానాయకుడి కత్తి వేటుకు తల ఎగిరి పక్కకి పడటం చూపించారు. దాని కంటే ముందు కూడా ఓ సన్నివేశం అదే విధంగా ఉంటుంది. విలన్ చేత అతని తండ్రిని హీరో నరికించడం చూపించారు. అక్కడ కూడా తల నేల మీద పడుతుంది.
ఒక్క 'వీర సింహా రెడ్డి'కి మాత్రమే అది పరిమితం కాలేదు. ఈ రోజు విడుదలైన మెగా మాస్ మూవీ 'వాల్తేరు వీరయ్య'లో కూడా ఆ నరకుడు కంటిన్యూ అయ్యింది. రెండు సినిమాలకు ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ కావడం వల్ల ఓ సినిమా హీరో, దర్శకుడికి తెలియకుండా మరో సినిమాకు సేమ్ టైప్ ఫైట్స్ కంపోజ్ చేశారా? లేదంటే రెండు సినిమాల దర్శకులు సేమ్ సీన్స్ రాసుకున్నారా? తెలియదు కానీ... 'వాల్తేరు వీరయ్య' పతాక సన్నివేశంలోనూ తల నరుకుడు సీన్ ఉంది. బ్యాక్ టు బ్యాక్... రెండు సినిమాలకు వెళ్ళిన ప్రేక్షకులు ఈ నరుకుడు ఇబ్బంది కలిగించింది.
'వినయ విధేయ రామ' ట్రోల్స్ గమనించలేదా?
'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య'కు కొంచెం ముందుకు వెళితే... నాలుగు ఏళ్ళ క్రితం సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' ఉంది కదా! అందులోనూ ఈ తరహా నరుకుడు ఉంటుంది. అది ఇంకా ఓవర్. హీరో కత్తితో విలన్స్ తలలు నరకడం... గాల్లోకి ఎగిరిన తలలను గద్దలు ఎత్తుకుని వెళ్ళడం... ఆ సన్నివేశాలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. వాటిని దర్శకులు గోపిచంద్ మలినేని, బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) గమనించలేదేమో!? అటువంటి సీన్స్ తీశారు.
'బాహుబలి'లో నరికారంటే ఓ అర్థం...
'బాహుబలి 2'లోనూ తల నరకుడు సన్నివేశం ఉంది. ''తప్పు చేశావ్ దేవసేనా... ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల'' అంటూ దర్బార్‌లో ఒకరి తల నరుకుతారు ప్రభాస్. ఆ సన్నివేశం చూసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే... స్క్రీన్ మీద చూస్తున్నది ఫాంటసీ ఫిల్మ్. అదీ రాజుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'వినయ విధేయ రామ' కథలు ఈ కాలంలో సాగేవి. ఎంత ఫిక్షన్ అయినప్పటికీ... ఆ ఫైట్స్, నరకుడు వ్యవహారాలు కొంత మంది ప్రేక్షకులకు ఎక్కడం లేదు.
Also Read : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే?
తల నరకడమే హీరోయిజం, అటువంటి సన్నివేశాల్లో మాత్రమే వీరత్వం ఉందని దర్శక, రచయితలు భావిస్తూ... పుచ్చకాయల్ని కోసినట్లు కత్తి వేటుకు తలలు తెగి పడే సన్నివేశాలను రాస్తూ ఉండటం ఎంత మాత్రం రైట్ కాదు. రైటర్ల పెన్నుల్లో పవర్ లేక ఇంకా అలాంటివి రాస్తున్నారనుకోవాలా!? కొత్త కంటెంట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న సమయంలో ఇంకెంత కాలం ఈ నరుకుడు భరించాలో!?
Also Read : 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?