Oscar nominations 2023: ‘నాటు నాటు’కు ఆస్కార్ తప్పకుండా వస్తుంది - ఏఆర్ రెహ్మాన్, చాలా గర్వంగా ఉందన్న మహేష్ బాబు
ఆస్కార్ 95 వ నామినేషన్ల జాబితాలో ‘నాటు నాటు’ పాట చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు లు మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘RRR’. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించారు. గతేడాది మార్చి 24న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకుంది. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి ఇప్పుడీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమాను ఆస్కార్ బరిలో నిలబెట్టారు. ఇటీవల ప్రకటించిన ఆస్కార్ 95వ నామినేషన్ల జాబితాలో సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో చోటు దక్కించుకుంది. ‘నాటు నాటు’ ఆస్కార్ బరిలో నిలవడంతో ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు RRR టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్ జాబితాలో నిలవడం చాలా సంతోషంగా ఉందని ఏ ఆర్ రెహమాన్ అన్నారు. ఈ పాట కోసం చిత్ర బృందం ఎంతో కృషి చేసిందని, నాటు నాటు పాట అన్ని విధాలుగా ఆస్కార్ రేసులో ముందుకెళ్తుందని అన్నారు. తప్పకుండా ఈ పాటకు ఆస్కార్ వస్తుందని ఆకాంక్షించారు. ఏ ఆర్ రెహమాన్ గతంలో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే.
Congrats @M_M_Keeravani garu ….I am sure you are going to win Along with Chandra bose ji ..best wishes to RRR team! https://t.co/EvRyEzgKoi
— A.R.Rahman (@arrahman) January 24, 2023
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘నాటు నాటు’ పాట నామినేషన్ దక్కించుకోవడంపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్ పొందడం ఎంతో గర్వపడే విషయమన్నారు. ముందు నేషన్స్ ఫేవరేట్ పాటగా ఉన్న ఈ పాట ఇప్పుడు ప్రపంచ ఫేవరేట్ పాటగా మారిందన్నారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు మహేష్.
Super proud that the nation's favourite, and now the world's favourite #NaatuNaatu is nominated for Best Original Song at the Oscars 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2023
అయితే ముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీ లో నామినేషన్ దక్కుతుందని ఆశించారు. అయితే ఈ రెండు విభాగాల్లోనూ నిరాశపరిచింది. కానీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మూవీ లోని ‘నాటు నాటు’ పాట నామినేషన్ దక్కించుకుంది. ‘నాటు నాటు’ పాటకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ సాంగ్ కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటతో పాటు ఈ కేటగిరీలో హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) పాటలు కూడా ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి. ఇక జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ సీక్వెల్ ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ మూవీ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇక మార్చి 23, 2023న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.