RRR Soul: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సోల్ యాంథమ్ 'జననీ...' విడుదలైంది. దీని ద్వారా రాజమౌళి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పారు?
రౌద్రం అంటే కోపం.
రణం అంటే యుద్ధం.
రుధిరం అంటే రక్తం.
'ఆర్ఆర్ఆర్'కు రాజమౌళి బృందం ఇచ్చిన నిర్వచనం. దాంతో సినిమాలో యుద్ధ సన్నివేశాలకు లోటు ఉండదని ప్రేక్షకులు చాలామంది భావిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు పెట్టుకున్నారు. యుద్ధం అంటే రాజుల మధ్య జరిగేది మాత్రమే కాదు, స్వరాజ్యం కోసం స్వాతంత్ర సమరయోధులు చేసింది కూడా యుద్ధమే. అయితే... ఆ యుద్ధంలో కొందరు రక్తం చిందించారు. మరికొందరు కోపోద్రిక్తులు అయ్యారు. అయితే... 'ఆర్ఆర్ఆర్'లో రాజమౌళి చెప్పాలనుకున్నది ఏమిటి? రౌద్రం రణం రుధిరం మాత్రమేనా? అంతకు మించి! 'ఆర్ఆర్ఆర్' సోల్ యాంథమ్ 'జనని...' చూస్తే అదే అర్థం అవుతోంది.
'ఆర్ఆర్ఆర్'లో రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... అంతకు మించి ఉంది. హృదయాలను కదిలించే భావోద్వేగం ఉందని 'జనని...' పాటతో చెప్పారు. ఆ భావోద్వేగాలే 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ అని పాట ప్రారంభంలో చెప్పారు. అప్పుడు నిశితంగా గమనిస్తే... అక్షరాల వెనుక అఖండ భారతం కనిపిస్తుంది. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్... ఇద్దరూ యుద్ధం మధ్యలో భావోద్వేగానికి గురైన సందర్భాలకు పాటలో చోటు కల్పించారు. ఎన్టీఆర్ హావభావాలు అయితే థియేటర్లలో కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. రక్తమోడుతూ కూర్చున్న రామ్ చరణ్‌ను చూస్తుంటే... హృదయమంతా భారమైన భావోద్వేగంతో నిండేలా ఉంది.
భారతీయుల్లోనే కాదు, ఇక్కడి మట్టిలోనూ పోరాటస్ఫూర్తి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు 'జనని...' పాట రాసిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. 'నీ పాదధూళి తిలకంతో... భారం ప్రకాశం అవనీ' పదాలు విన్నారా? స్వరాజ్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. వారి పాదధూళి మిళితమైన మట్టిని తిలకంగా పెడితే... ఆ భారం ప్రకాశం అవుతుందని చెప్పారు. రామ్ చరణ్‌కు ఆలియా భట్ మట్టిని తిలకంగా దిద్దడం... ఎమోషనల్ అండ్ హీరోయిక్ మూమెంట్.
'నీ నిష్కళంక చరితం... నా సుప్రభాతం అవనీ!' - ఎటువంటి కళంకం లేని ఆ చరిత్రను ప్రతిరోజూ వినే సుప్రభాతంతో పోల్చారు. ఆ తర్వాత... స్వాతంత్య్ర సాధనలో గాలిలో వచ్చే ధ్వనులు గర్జనలు అవుతాయని, లాలి జోల పాట అవుతుందని అన్నారు. 'లాలి జోలలు అవనీ' అని వచ్చేదగ్గర చిన్న పిల్లాడు తుపాకీ తూటాకు నెలకు ఒరగడం హృదయాలను కలచివేస్తుందని చెప్పాలి. అంతకు ముందు తూటాలకు బలవుతున్న భారతీయులు చిన్నారికి ఏం కాకూడదని, ఆమెను కాపాడాలని చేసే ప్రయత్నం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
'జనని...' పాటతో ప్రేక్షకుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసే దృష్టి మారుతుందని చెప్పాలి. ఎందుకంటే... దీనికి ముందు రాజమౌళి తీసిన సినిమా 'బాహుబలి'. అందులో భావోద్వేగాలు ఉన్నప్పటికీ, యుద్ధ సన్నివేశాలు ఎక్కువ హైలైట్ అయ్యాయి. అందులో ఉన్నది భల్లాలదేవ (రానా పాత్ర పేరు) రాజ్యకాంక్ష అయితే... 'ఆర్ఆర్ఆర్'లో ఉన్నది కోట్లాదిమంది భారతీయుల స్వరాజ్యకాంక్ష. దాని వెనుక ఎటువంటి పోరాటాలు జరిగాయి? యుద్ధం జరిగింది? అనేదాంతో పాటు భావోద్వేగాలను చూపిస్తున్నట్టు ఒక్క పాటతో చెప్పారు. యుద్ధానికి ఎమోషన్ తోడైతే... విజువల్ ఎప్పటికీ మనసు లోంచి చెరగదు.
'జనని...' పాటను చూడండి:
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి