DVV Danayya On Oscars: నేను వారితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ.. : ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించడంపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు.
సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అమెరికాలో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈసారి అకాడమీ అవార్డులలో ఇండియాలో నుంచి నామినేషన్ దక్కించుకున్న సినిమాల్లో బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట అవార్డు దక్కించుకోగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ జాబితాలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది రెండు ఆస్కార్ అవార్డులు మన దేశానికి వచ్చాయి. దీంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఓ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ్వడం అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడంతో తెలుగు ప్రజలతో పాటు యావత్ భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించడం పట్ల టాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య దీనిపై స్పందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా భారతీయులంతా ఎదురు చూస్తోన్న కల నేటికి నిజం అయిందని హర్షం వ్యక్తం చేశారు. తమ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం చాలా గొప్పగా అనిపిస్తుందని అన్నారు. వాస్తవానికి ఈ సినిమాను ప్రారంభించినపుడు ఆస్కార్ వస్తుందని అనుకోలేదని, కానీ ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు. ఆ సందర్బంలో తాను వారితో మాట్లాడానికి ప్రయత్నించాననీ.. కానీ, వారు బిజీగా ఉండటం వలన రీచ్ అవ్వలేదని అన్నారు. ఇక నుంచి కచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తారని, భవిష్యత్ లో మరిన్ని ఆస్కార్ లు సాధిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ కోసం ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచీ ఆస్కార్ అందుకునే వరకూ నిర్మాత దానయ్య ఎక్కడా కనిపించలేదు. ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కూడా ఆయన పెద్దగా స్పందించ లేదు. దీంతో వీరి మధ్య ఏం జరిగింది అంటూ చర్చ మొదలైంది. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ మూవీ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలసి నటించారు. సినిమా మొత్తం స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథను చూపిస్తుంది. ఇక మూవీలో చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో పోరాట సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, పాటలు అన్నీ బాగుండటంతో మూవీకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందుకే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ తదితన నటీనటులు కీలక పాత్రలలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
Read Also: ‘నాటు నాటు’ స్టెప్పులు వెయ్యాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ మలయాళ పత్రిక చూస్తే సరిపోతుంది!