Guntur Karam Movie: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?
Guntur Karam Movie: త్రివిక్రమ్ మూవీ అనగానే ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉంటాయి. ఆయన డైలాగులు, సినిమాల్లో తీసుకునే కథాంశాలు ఆకట్టుకుంటాయి. కానీ, ‘గుంటూరు కారం’ మీద బోలెడు విమర్శలు వస్తున్నాయి.
Guntur Karam Kurchi Madathapetti Song: త్రివిక్రమ్ తీసే సినిమాల కన్నా, ఆయన మాట్లాడే అద్భుతమైన మాటలకే చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఆయన జీవితసత్యాలను సులభంగా చెప్తారనే మంచి పేరు ఉంది. అలాంటి త్రివిక్రమేనా ఇలా మారిపోయాడూ అని అనిపిస్తుంది ‘గుంటూరు కారం’ మూవీ నుంచి లేటెస్ట్ పాట ప్రోమో వింటుంటే! ఆ పాటపేరు ‘కుర్చీ మడతపెట్టి’. సోషల్ మీడియా జనాలకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం ఓ యూట్యాబ్ ఛానల్ వీడియోలో ఓ ముసలాయన మాట్లాడుతారు. మాటల మధ్యలో ఆయన ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అంటారు. ఈ మాట తర్వాత ఓ బూతు కూడా ఉంటుంది. కానీ, అది ఇక్కడ చెప్పలేం!
కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ చాలా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ మీమ్ ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఆ మీమ్స్, ట్రోల్స్ నెటిజన్లు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ, దాన్ని సిల్వర్ స్క్రీన్ మీదకు, కోట్లాది మందికి చేరే సినిమాలోకి, అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకుడు ఓవైపు, ఎన్నో లోతైన డైలాగులు, కథలు చెప్పే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోవైపు ఉన్న సినిమాలోకి తీసుకొచ్చారు. దీన్నే సినిమా అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అలా అని ఇప్పటిదాకా అసలు స్టార్ హీరోల సినిమాల్లో బూతులు లేవా అంటే, లేవని కాదు. పాత్ర ప్రకారం, సన్నివేశం ప్రకారం బూతులకు మన ఆడియన్స్ అంతా అలవాటు పడిపోయారు. కానీ, ఎక్కడో ఓ మారుమూల మాట్లాడిన బూతు, సోషల్ మీడియాలో పాపులర్ అయినంత మాత్రాన దాన్నే సినిమాలోకి, అందులోనూ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాకు తీసుకొచ్చేయడం ఏంటని చాలా మంది విమర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒకప్పుడు ‘అఆ’ మూవీ ప్రిరిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు. ‘‘బూతులు మాట్లాడి నవ్వించడం చాలా ఈజీ. ప్రతి ఒక్కరూ నవ్వుతారు. కానీ, నవ్విన వెంటనే మనల్ని చాలా తక్కువగా చూస్తారు’’ అని అన్నారు. మరి, ఆ మాటలను మన మాటల మాంత్రికుడు మరిచారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే ‘గుంటూరు కారం’ సినిమా మీద చాలా నెగెటివ్ వైబ్స్ ఉన్నాయి. ‘ఓ మై బేబీ’ సాంగ్ అంతగా ఎక్కలేదు. దానిపై వచ్చిన ట్రోల్స్ కు నిర్మాత నాగవంశీ, తమన్, రామజోగయ్య శాస్త్రి స్పందించిన తీరును కూడా చాలా తప్పుబట్టారు. ఇంత నెగెటివిటీకి తోడు ఇప్పుడు ఇలా ఓ బూతు రిఫరెన్స్ పాట తోడైంది. చూడాలి మరి. ఇది ఎంత మేర ఇంపాక్ట్ చూపిస్తుందో. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఇదేమీ పట్టించుకోవట్లేదు. మా బాబు స్టెప్పులతో సావగొట్టాడని, సంక్రాంతికి థియేటర్లు తగలపడిపోతాయని సంబరాలు చేసుకుంటున్నారు. ఓ నాసిరకం బూతును తమ హీరో సినిమాలో పెట్టడం ఏంటని ఆలోచించాల్సింది పోయి.. ఆహా, ఓహో అంటూ కాలర్ ఎగరేడయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో తెలుగు సాహిత్యం మీద ఎంతో లోతైన అవగాహన ఉన్న త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మరీ ఇంత పలుచబారు ఆలోచన చేయడం బాధ కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ చిన్న విషయాన్ని పట్టుకుని సినిమా మొత్తాన్ని జడ్జ్ చేయలేం. ఆ పాట పెట్టడానికి ఒక సందర్భం ఉండవచ్చు. ఇప్పటి ట్రెండ్ గురించి త్రివిక్రమ్ ఒక మెట్టు కిందకి దిగి ఉండవచ్చని మరికొందరు అంటున్నారు.
Read Also: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..