Ravi Shankar On Fan War : అమెరికాలో నందమూరి, మెగా ఫ్యాన్స్ గొడవ పడొద్దు - డల్లాస్ ఘటనపై నిర్మాత రవిశంకర్
అమెరికాలో నిర్వహించిన ఓ పార్టీలో టీడీపీ, నందమూరి అభిమానులు - జనసేన, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య గొడవ జరిగింది. 'వీర సింహా రెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రవిశంకర్ ఆ గొడవను ప్రస్తావించారు.
నందమూరి, మెగా (కొణిదెల) కుటుంబాలకు చెందిన హీరోలు ఈ మధ్య తరచూ కలుస్తున్నారు. సినిమా వేడుకలు కావచ్చు, ఓటీటీ టాక్ షోలకు అయితే కావచ్చు... ఒక్క ఫ్రేములో హీరోల మధ్య ఆత్మీయ, స్నేహ బంధాన్ని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతోంది. అయితే, కొందరు అభిమానులు మాత్రం ఇంకా కలవడం లేదు. హీరోల మధ్య ఉంటున్న స్నేహ సంబంధాలు వాళ్ళ మధ్య ఉండటం లేదు. గొడవలు పడుతున్నారు.
సోషల్ మీడియాలో గొడవ పక్కన పెడితే... న్యూ ఇయర్ సందర్భంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నందమూరి, మెగా ఫ్యాన్స్ గొడవ పడ్డారు. తప్పు ఒప్పులు ఎవరివి? అనేది పక్కన పెడితే... గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. గొడవ ఎక్కడ మొదలైంది? అనేది పక్కన పెడితే... నందమూరి అభిమానులు 'వీర సింహా రెడ్డి' ఫ్లెక్సీలు, మెగా ఫ్యాన్స్ 'వాల్తేరు వీరయ్య' ఫ్లెక్సీలు వాగ్వాదం జరుగుతున్న సమయంలో కనిపించాయి. ఆ ఘటనపై 'వీర సింహా రెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ స్పందించారు.
రెండూ బ్రహ్మాండమైన సినిమాలు!
''నందమూరి అభిమానులు ఎంత ఊహించుకున్నా... దాన్ని మించి 'వీర సింహా రెడ్డి' సినిమా ఉంటుంది. అందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. అలాగే, అమెరికాలో ఉన్న అందరికీ, డల్లాస్ లో ఉన్నవాళ్ళు... ఎవరూ గొడవ పడొద్దు. రెండూ బ్రహ్మాండమైన సినిమాలే. రెండు సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి'' అని రవి శంకర్ అన్నారు. 'వీర సింహా రెడ్డి'తో పాటు 'వాల్తేరు వీరయ్య'ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే.
Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు వస్తుండటంతో అభిమానుల మధ్య పోటాపోటీ వాతావరణం కొన్ని ఏరియాల్లో ఉంది. తమ హీరో సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ చేయాలని ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎవరినీ డిజప్పాయింట్ చేయకుండా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తోంది. రెండిటికీ గ్రాండ్ ఓపెనింగ్స్ ఉంటాయని 'వాల్తేరు వీరయ్య' మీడియా సమావేశంలోనూ రవి శంకర్ చెప్పారు. థియేటర్ల సమస్య కూడా ఉండదని అన్నారు.
థియేటర్స్ సమస్య ఉండదు!
విజయ్ 'వారసుడు' కూడా సంక్రాంతి బరిలో ఉంది. తెలుగులో అగ్ర నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు నిర్మించిన చిత్రమది. దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని, చిరు బాలయ్య సినిమాలకు తక్కువ థియేటర్లు వస్తున్నారని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సహా కొందరు నిర్మాతలు కామెంట్స్ చేశారు. ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు వస్తే ఎక్కువ థియేటర్లు ఎలా వస్తాయని 'దిల్' రాజు కూడా చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే... 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కూడా అడుగు పెడుతోంది. ఎవరి సినిమాకు ఎన్ని థియేటర్లు ఇస్తారు? అని అడిగితే... ''రెండు సినిమాల విడుదలకు ఇంకా సమయం ఉంది. థియేటర్ల పరంగా సమస్యలు ఏమీ లేవు. ఏ సినిమా స్టామినాకి ఎన్ని థియేటర్లు కావాలో అన్ని జరుగుతాయి. ఏవైనా ఒకటి ఆరా ఉంటే డిస్కషన్ ద్వారా సాల్వ్ అవుతుంది. నథింగ్ టు వర్రీ'' అని 'వాల్తేరు వీరయ్య' కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి శంకర్ చెప్పారు.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?