Ram Setu Movie Trailer : ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలు ఉన్నాయి కానీ సేతు ఒక్కటే - నమ్మకాన్ని సవాల్ చేసే 'రామ్ సేతు'
'రామ్ సేతు' ట్రైలర్ నేడు విడుదలైంది. తెలుగులోనూ సినిమాను విడుదల చేయనున్నారు. మరి, ట్రైలర్‌లో వినిపించిన జై శ్రీరామ్ నినాదాలు థియేటర్లలో వినిపిస్తాయా? లేదా?
అక్షయ్ కుమార్ (Akshay Kumar) కథానాయకుడిగా నటించిన సినిమా 'రామ్ సేతు' (Ram Setu). ఇందులో టాలీవుడ్ యువ కథానాయకుడు సత్యదేవ్ (Satyadev Kancharana) ముఖ్యమైన పాత్ర చేశారు. ఇంకా జాక్వలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ బరుచా, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 25న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
శ్రీరాముడిపై నమ్మకంతో నడిచే దేశం!
Ram Setu Trailer Review : ''ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది'' అని నాజర్ చెప్పే డైలాగుతో 'రామ్ సేతు' ట్రైలర్ ప్రారంభం అయ్యింది. ఆ మాటకు ముందు సముద్రంలో నౌక, కొండల్లో వెళుతున్న తీవ్రవాదులు, గాల్లో హెలికాఫ్టర్ చూపించారు. రామ సేతు (Ram Setu) ను కూల్చి వేయడానికి సుప్రీమ్ కోర్టును ప్రభుత్వం అనుమతి కోరుతుంది. దాంతో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు. కోర్టు దగ్గర ప్లకార్డులు, బ్యానర్లతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తారు. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్లారు. 'ఆ (శ్రీరాముడిపై) నమ్మకాన్ని ఎలా సవాల్ చేయగలుగుతావ్?' అని నాజర్ సందేహం వెలిబుచ్చగా... ''అందుకు నాకు తెలిసిన సమర్థుడు ఒకడు ఉన్నాడు'' అని ఒకరు సమాధానం ఇస్తారు. అప్పుడు అక్షయ్ కుమార్ పాత్రను పరిచయం చేశారు.
రామ్ సేతుపై పరిశోధనలకు అక్షయ్ కుమార్‌కు నాజర్ సహాయం చేయడానికి ముందుకు రావడం... ఆ తర్వాత జరిగిన అంశాలు 'రామ్ సేతు' కథగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ''నా పనే ఇతిహాసాల్లోని నిజాలను వెలుగులోకి తీయడం'' అని అక్షయ్ కుమార్ చెప్పే డైలాగ్ ఆయన క్యారెక్టరైజేషన్ చెబుతోంది. ఏడు వేల సంవత్సరాల జరిగిన చరిత్రను కొందరు ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు? వాళ్లకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? నిజం ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి. రామ చరిత్రను ధ్వంసం చేయడానికి తీవ్రవాదులు ఏం చేశారనేది చెప్పకుండా సినిమాపై ఆసక్తి మరింత చెప్పారు.
'రామ్ సేతు' ట్రైలర్‌లో 'రామ్ రామ్ రామ్ రామ్' అంటూ వినిపించే నేపథ్య సంగీతం ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. విజువల్స్ బావున్నాయి. ఇదొక ఎపిక్ అడ్వెంచర్ ఫిల్మ్ అని చెబుతోంది. ''ఈ ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలు ఉన్నాయి. కానీ, (రామ) సేతు ఒక్కటే ఉంది'' అని ట్రైలర్ ముగించారు.
దీపావళికి రాముడి చరిత్ర!
లంకలోని సీతా దేవిని చేరుకోవడం కోసం వానర సైన్యం సాయంతో శ్రీరాముడు 'రామ్ సేతు'ను నిర్మించాడని పురాణాలు మనకు చెబుతున్నాయి. రామాయణంలో, రాముడి చరిత్రలో రామ సేతుకు చాలా ప్రాముఖ్యం ఉంది. దానిపై తెరకెక్కించిన సినిమా దీపావళికి విడుదల కానుండటం విశేషం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 24, 25వ తేదీల్లో దీపావళి పండుగ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read : కాషాయ జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?
'రామ్ సేతు' సినిమాలో ప్రవేశ్ రాణా, జెన్నిఫర్ పిక్కినెటో (Jeniffer Piccinato) ఇతర తారాగణం. ఆహా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'సిన్'లో జెన్నిఫర్ నటించారు. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో నిర్మించాయి. జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
Also Read : ప్రజారాజ్యం అప్పులకు చిరంజీవి అమ్మేసిన 'కృష్ణా గార్డెన్స్' చరిత్ర ఏమిటి? ఇప్పుడు దాని విలువ ఎంత?