Chhatriwali Movie: సిగ్గు పడకూడదు, ఆ టాపిక్‌ను పిల్లల సిలబస్‌లో చేర్చాలి: రకుల్ ప్రీత్ సింగ్
శృంగారానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండటం ఎంతో అవసరమని అంటోంది బబ్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
ఒకప్పుడు సినిమాల్లో శృంగార సంబంధిత సన్నివేశాలుంటే చేయలేమని, లేదంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని హీరోయిన్లు డిమాండ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. శృంగారం అనే మాట వినగానే చెవులు, నోళ్లు మూసేసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటోంది బబ్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ఛత్రీవాలీ. ఇందులో ఆమె సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు నేర్పే కెమిస్ట్రీ టీచర్ పాత్రలో నటించింది. శుక్రవారం సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంతకీ రకుల్ ఏమంటోందంటే.. ఒకప్పుడు శృంగారం అనే పదాన్ని వినగానే కళ్లు, చెవులు మూసేసుకోవడం, అవేం పాడు మాటలు అంటూ సిగ్గుపడిపోవడం లాంటివి ఉండేవని ఇప్పుడు మారుతున్న సమాజం తీరును బట్టి ఈ విషయానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చర్చించుకోవడమే ఉత్తమం అని అంటోంది. ‘‘ఈ సినిమాకు సంతకం చేశాక.. ఈ విషయం గురించి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. నాకున్న పరిచయాల ద్వారా కొన్ని వివరాలు వచ్చాయి. అవి చూసి షాకయ్యాను. మన సమాజంలో రక్షణతో కూడిన శృంగారం గురించి చాలా మంది ఆడవాళ్లకి తెలీకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. వారికి శారీరకంగా నొప్పి ఉన్నప్పటికీ అది సహజమే అనుకుని ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేశారు. శృంగారం అనేది శారీరకంగా, మానసికంగా నొప్పిని కలిగించే అంశం. లక్కీగా ఈ సినిమా ద్వారా సురక్షితమైన శృంగారం అనే టాపిక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ఈ అంశాన్ని సీరియస్‌గా చెప్తే ఎవరికీ మింగుడుపడదు. పైగా లేనిపోని కామెంట్లు చేస్తారు. అందుకే సోషల్ హ్యూమర్ థీమ్‌తో సినిమాను తెరకెక్కించారు’’ అని తెలిపింది.
పిల్లల సిలబస్‌లో సేఫ్ సెక్స్ టాపిక్ చేర్చాలి
‘‘నిజానికి పిల్లల సిలబస్‌తోనూ సేఫ్ సెక్స్ టాపిక్‌ని చేర్చాలి. ఇలాంటి పిల్లలు మాట్లాడకూడదు అని అనడం మానేసి వారికి సరైన అవగాహన కలిపించాలి. అది చదువు ద్వారా సాధ్యమవుతుంది. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు శృంగారం గురించి ఓ సెమినార్ పెట్టారు. అది వినగానే మాలో మేం సిగ్గుపడిపోతూ.. ఆ సెమినార్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాం. కానీ ఇప్పుడు సమాజానికి ఈ పాఠాలు నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యం అనే టాపిక్స్ ఇప్పుడు ఎంత ముఖ్యమో ఈ టాపిక్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ టాపిక్ గురించి చర్చించడం వల్ల మనకు కలిగే హాని అయితే లేదు కదా. కనీసం దాని వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి జనాలు థియేటర్లకు రారు. అదే ఓటీటీలో రిలీజ్ చేస్తే ముందు ప్రైవేట్‌గా సినిమా చూసినా.. ఆ తర్వాత అందులో ఉన్న మెసేజ్‌లో ఎలాంటి తప్పు లేదు అని తెలుసుకుని తర్వాత ఫ్యామిలీకి కూడా చూడమని సజెస్ట్ చేస్తారు’’ అని రకుల్ తెలిపింది.