Pranay Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ
Pranay Reddy Vanga: ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ‘అర్జున్ రెడ్డి‘ హిట్ కాకపోయి ఉంటే, సందీప్ వంగ పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
Pranay Reddy Vanga About Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్‘ మూవీ దేశ వ్యాప్తంగా సంచనల విజయాన్ని అందుకుంది. ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా పొడ్యూసర్ గా మారారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
నష్టపోయినా ఫర్వాలేదు అనుకునే ‘అర్జున్ రెడ్డి’ చేశాం- ప్రణయ్
నష్టపోయినా ఫర్వాలేదు అని భావించే సందీప్ రెడ్డి వంగను ‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లు ప్రయణ్ రెడ్డి తెలిపారు. సినిమా ఆడకపోతే రూ.కోటి వరకు నష్టపోతామని భావించినట్లు చెప్పారు. అయినా, మూవీ అద్భుతంగా ఆడిందన్నారు. “’అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో చాలా రిస్క్ తీసుకున్నాం. మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? అని అనుకున్నా. ఒక వేళ సినిమా హిట్ కాకపోతే రూ.50 లక్షలు లేదంటే కోటి రూపాయలు పోతాయి అనుకున్నాం. రెండు, మూడు ఏళ్లలో మళ్లీ సెట్ బ్యాక్ అవుతాం అనుకున్నాం. కానీ, మా రిస్క్ ఫలించింది. ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ‘కబీర్ సింగ్’ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కోసం సందీప్ చాలా కష్టపడి స్క్రిప్ట్ రాశారు. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ కాకపోయి ఉంటే, తను సినిమాలు మానేసి మా బిజినెస్ చూసుకునే వారు అనుకుంటున్నాను. కానీ, తనకు చాలా విశ్వాసం ఉంది. ఆయన విశ్వాసం ‘అర్జున్ రెడ్డి’ని సక్సెస్ ఫుల్ గా నిలబెట్టింది” అన్నారు.
నేను దర్శకుడిని చేశా, తను ప్రొడ్యూస్ ని చేశాడు- ప్రణయ్
సందీప్ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడని చెప్పారు ప్రణయ్. నటీనటుల ఎంపిక కరెక్ట్ ఉంటే సగం సినిమా అయిపోయినట్టే అని తను భావిస్తాడని చెప్పారు. “డేట్స్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు. వారిని తన సినిమాలో తీసుకోవాలి అనుకోడు సందీప్. తన కథకు కచ్చితంగా ఎవరు సరిపోతారో వారినే తీసుకుంటాడు. తన పని విషయంలో ఎక్కడా అజాగ్రత్తగా ఉండడు. నటీనటుల విషయంలో నేను సలహా ఇస్తాను. కానీ, ఫైనల్ నిర్ణయం తనదే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత కూడా 4 సంవత్సరాలు నేను అమెరికాలో పని చేశాను. 2021లో అక్కడ వర్క్ మానేశాను. నేను ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సందీప్ ను దర్శకుడిగా పరిచయం చేశాను. సందీప్ ‘యానిమల్’ సినిమాతో నన్ను ప్రొడ్యూసర్ గా పరిచయం చేశాడు. ప్రస్తుతం కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లోకి వచ్చేశాను” అని చెప్పారు. “సందీప్ రెడ్డి సినిమాలు నెమ్మదిగా తెరకెక్కడానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమాలోని ప్రతి అంశాన్ని తను పరిశీలించి ఓకే అనుకున్నాకే ఫైనల్ చేస్తారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అతడు వాటిని టచ్ చేసి చూశాకే సరే అంటాడు. అందుకే సినిమా నిర్మాణం అనేది ఆలస్యం అవుతుంది. కానీ, తను అనుకున్నట్లు వస్తుంది” అన్నారు.
Read Also: ఓటీటీలోకి మమ్ముటి గే పాత్రలో నటించిన మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?