Heeraben Death: ఆమె అసాధారణ జీవితం గడిపారు - ప్రధాని మోడీకి చిరంజీవి సంతాపం
ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోడీ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ లో ఓ భావోద్వేగ ట్వీట్ ను విడుదల చేశారు
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్(100) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యం కారణంగా అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారామె. ఇటీవల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆమె నిస్వార్థ కర్మయోగి, ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని పేర్కొన్నారు మోడీ. తన తల్లి వందో పుట్టిన రోజున ఆమెను కలిశానని గుర్తు చేసుకున్నారు.
ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు ‘‘ప్రధాని మంత్రి తల్లి హీరాబెన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. స్వర్గలోకానికి వెళ్లిన ఆమె దివ్య ఆత్మకు నా నివాళులు. మోడీకి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. మరోవైపు ప్రధాని మంత్రి తల్లి హీరాబెన్ మృతి పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Deeply saddened by the demise of Smt.Heeraba Modi ji , beloved mother of our Hon’ble Prime Minister.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2022
She lived an extraordinary life. My tributes to the divine soul who left for the heavenly abode.
My heartfelt condolences to Shri @narendramodi ji ! Om Shanti! 🙏🙏
ఇటీవల ప్రధాని మోడీ గుజరాత్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా అక్కడికి వెళ్లారు. తన తల్లి హీరాబెన్ కూడా ఆ ఎన్నికల్లో ఓటు వేశారు. అప్పుడు ఆయన తన తల్లి హీరాబెన్ ను కలుసుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఇక మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిశాయి. తల్లి మరణించిన వార్త తెలుసుకున్న ప్రధాని వెంటనే అహ్మదాబాద్ బయలుదేరారు. అక్కడకు చేరుకొని తన తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు సందర్శన అనంతరం గాంధీ నగర్ లోని సెక్టార్ 30 శ్మశాన వాటిక లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మోడీతో పాటు ఆయన సోదరులు కూడా పాడె మోశారు. అయితే తన తల్లి మరణించిన బాధలో ఉన్నా.. ప్రధానిగా ఆయన తన బాధ్యతలను ఏ మాత్రం మరవలేదు. శుక్రవారం షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఇంకా ప్రారంభోత్సవాలకు ప్రధాని మోడీ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తల్లి హీరాబెన్ మరణించడంతో హుటాహుటిన అహ్మదాబాద్ కు వెళ్లారు. అయితే హాజరు కావాల్సిన కార్యక్రమాలకు వెళ్లలేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ.
Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?